
కల్లోల్ భట్టాచార్జీ రాసిన ”నెహ్రూస్ ఫస్ట్ రిక్రూట్స్: ద డిప్లమేట్స్ హూ బిల్డ్ ఇండిపెండెంట్ ఇండియాస్ ఫారెన్ పాలసీ” అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం ఢిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా అయ్యర్ మాట్లాడుతూ, 1962 అక్టోబర్‌లో భారత్‌పై చైనా బలగాలు దాడి చేశాయనే ఆరోపణలున్నాయని వ్యాఖ్యానించారు. వాస్తవానికి 1962 అక్టోబర్- నవంబర్ మధ్య ఇండో-చైనా యుద్ధం జరిగింది. చైనా బలగాలు ‘మెక్‌మోకన్ లైన్’ వెంబడి దాడి చేసి ఇండియాకు చెందిన ‘ఆక్సాయ్ చిన్’ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.
చైనా దాడిని ఆరోపణగా మణిశంకర్ అయ్యర్ పేర్కొనడంపై భారతీయ జనతాపార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన 38,000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే చైనా దురాక్రమణను కాంగ్రెస్ తుడిచివేయాలని అనుకుంటోందని విమర్శించింది. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు వచ్చే శాశ్వత సభ్యత్వాన్ని కూడా నెహ్రూ ఆనాడు చైనా కోసం వదిలేశారని పార్టీ తప్పుపట్టింది. మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో కాంగ్రెస్ వెంటనే వివరణ ఇచ్చింది.
ఈ సంఘటన వీడియో వెంటనే వైరల్ కావడంతో బిజెపి దీనిని “రివిజనిజంలో నిస్సంకోచమైన ప్రయత్నం” అని పేర్కొంది. బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాల్వియా, ఎక్స్‌లో వీడియోను షేర్ చేస్తూ, అయ్యర్, కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. “మణిశంకర్ అయ్యర్, ఎఫ్‌సిసిలో మాట్లాడుతూ, నెహ్రూస్ ఫస్ట్ రిక్రూట్‌లు అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా, 1962లో చైనా దాడిని ‘ఆరోపణ’గా ప్రస్తావించారు. ఇది రివిజనిజంపై దురదృష్టకర ప్రయత్నం,” అని బిజెపి నాయకుడు ఎక్స్‌లో మండిపడ్డారు.
మరోవంక, పొరపాటును గ్రహించి అయ్యర్ వెంటనే క్షమాపణలు చెప్పారు: “ఈ సాయంత్రం ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో ‘చైనీస్ దండయాత్ర’కు ముందు ‘ఆరోపణ’ అనే పదాన్ని పొరపాటుగా ఉపయోగించినందుకు నేను నిస్సందేహంగా క్షమాపణలు కోరుతున్నాను” అని తెలిపారు.
మణిశంకర్ అయ్యర్ పొరపాటున ‘ఆరోపణ’ అనే పదాన్ని వాడారని, దానికి వెంటనే క్షమాపణలు తెలియజేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ వివరణ ఇచ్చారు. ఈ వివాదానికి కాంగ్రెస్ దూరంగా ఉంటుందని పేర్కొన్నారు. చైనా బొరబాట్లను భారత ప్రధాన నరేంద్ర మోదీనే ఆరోపణగా అభివర్ణించి ఆ దేశానికి క్లీన్ చిట్ ఇచ్చారంటూ ఆయన ప్రతి విమర్శలు చేశారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైన వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి