బీసీ గురుకుల పాఠశాలల్లో విషాహారంతో అస్వస్థత

బీసీ గురుకుల పాఠశాలల్లో విషాహారంతో అస్వస్థత
తెలంగాణ రాష్ట్రంలోని పలు బీసీ గురుకుల పాఠశాలలో గత ఏడు నెలలలో  చాలా మంది విద్యార్థులు విషాహారం కారణంగా అస్వస్థతకు గురయ్యారని
బిజెపి ఓబిసి మోర్చా ఆందోళన వ్యక్తం చేసింది. మంచినీటి వసతి లేక కలుషితమైన ఆహారం తినడంతో వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని తెలిపింది. 
 
 దీనిపైన ఇప్పటివరకు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని  బిజెపి ఓబిసి మోర్చా తెలంగాణ అధ్యక్షులు ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో  మహాత్మ జ్యోతిబా తెలంగాణ బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి సైదులుకు సమర్పించిన వినతిపత్రంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్ళిన కూరగాయలు వండి పెట్టడంతో విద్యార్థులు తీవ్ర అనారోగ్య పాలయ్యారని తెలిపారు.
 
 గత విద్యా సంవత్సరంలో విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినప్పటికీ అంటే జూన్ లో విద్యా సంవత్సరం ప్రారంభం అయితే (జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు) విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం కారణంగా విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా ఉన్న టీచర్ల మీద ఎక్కువ ఒత్తిడి వల్ల పనిచేయలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. 
 
సన్న బియ్యం బదులుగా దొడ్డు బియ్యం, రాత్రి మిగిలిన అన్నం పొద్దున్న టిఫిన్గా విద్యార్థులకు పెట్టడం, కుళ్ళిన కూరగాయలతో కూరలు వండటం, అపరిశుభ్రమైన వాతావరణం, బెడ్స్ లేకపోవడం, బాత్రూమ్ లు సరిగా లేకపోవడం, తాగునీరు, వాడుకునే నీరు లేకపోవడం ఇలాంటి అనేక సమస్యల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వివరించారు.
 
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి సమస్యల మీద వెంటనే చర్యలు తీసుకోవాలని బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. కులాల వారీగా గురుకులాలను విడదీసి వందల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయిస్తున్నా కూడా ఇట్లాంటి తీవ్రమైన సమస్యలు ఉండటం, వాటి మీద స్పందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అంటూ విమర్శించారు.
 
బిసి గురుకులాలలో తక్షణమే భవనాల పరిశుభ్రత మరియు అవసరమైన బాత్రూమ్ల ఏర్పాటు, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్, మంచి భోజన వసతి ఏర్పాటు వీటి అన్నిటి మీద వెంటనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో సమస్యల పరిష్కారం కోసం రిలే నిరాహారా దీక్షలు చేపడతామని హెచ్చరించారు.