
ఢిల్లీకి చెందిన సీఎస్ఈ దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో 2001 జనవరి నుంచి 2024 ఏప్రిల్ వరకు నమోదైన ఉష్ణోగ్రతలు, వాతావరణంపై అధ్యయనం చేసింది. ఇందులో ప్రధాన నగరాల్లో ఏటా ఉష్ణ సూచిక పెరిగిపోతున్నదని తేల్చింది. అసలైన ఉష్ణోగ్రతకు తోడుగా తేమను పరిగణనలోకి తీసుకొని ఎంత వేడిగా ఉందో ఉష్ణ సూచికతో లెక్కిస్తారు. ఇది 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉంటే మనుషుల ఆరోగ్యానికి ప్రమాదకరం. ప్రధాన నగరాల్లో హీట్ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి దగ్గరలో ఉన్నది.
ప్రస్తుతం వేసవిలో సగటున చెన్నైలో 37.4 డిగ్రీలు, కోల్కతాలో 36.5 డిగ్రీలు, ముంబైలో 34.3 డిగ్రీలు, ఢిల్లీలో 32.2 డిగ్రీలు, హైదరాబాద్లో 29.3 డిగ్రీలు, బెంగళూరులో 26.9 డిగ్రీల సెల్సియస్ హీట్ ఇండెక్స్ నమోదవుతున్నది. పెరుగుతున్న పట్టణీకరణకు, వేడి ఒత్తిడికి మధ్య సంబంధం ఉందని అధ్యయనం గుర్తించింది.
గత రెండు దశాబ్దాలుగా ఈ నగరాల్లో వేగంగా కాంక్రీట్ నిర్మాణాలు జరిగాయని, పచ్చదనం తగ్గిపోయిందని ఫలితంగా వేడి పెరుగుతున్నదని తెలిపింది. గత రెండు దశాబ్దాల్లో చెన్నై బిల్ట్అప్ ఏరియా(నిర్మాణాలు) రెండింతలైంది. ముంబైలో 2003లో 38.4 శాతంగా ఉన్న బిల్ట్అప్ ఏరియా 2023 నాటికి 52.1 శాతానికి చేరుకుంది.
ఇదే సమయంలో పచ్చదనం మాత్రం 35.8 శాతం నుంచి 30.2 శాతానికి తగ్గింది. బెంగళూరులో బిల్ట్అప్ ఏరియా 37.5 శాతం నుంచి ఏకంగా 71.5 శాతానికి పెరిగింది. చెన్నైలో 30.7 శాతం నుంచి 73.5 శాతానికి పెరిగింది. పచ్చదనం 34 శాతం నుంచి 20.3 శాతానికి పడిపోయింది.
సాధారణంగా వర్షాకాలం ప్రారంభానికి ముందు కంటే వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండాలి. కానీ గత పదేండ్లుగా ఈ పరిస్థితి మారిపోతున్నది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలో ఉష్ణ సూచిక వర్షాకాలానికి ముందు కంటే వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుండగా, హైదరాబాద్, బెంగళూరులో మాత్రం కొంత చల్లగానే ఉంటున్నదని సీఎస్ఈ గుర్తించింది.
మొత్తంగా 2001 – 10తో పోలిస్తే గత పదేండ్లలో వర్షాకాలంలో సగటున 1 డిగ్రీ సెల్సియస్, వర్షాకానికి ముందు ప్రీ మాన్సూన్లో 0.5 డిగ్రీల సెల్సియస్ వేడి పెరిగింది. ప్రస్తుతం భారత జనాభాలో 36 శాతం(40 కోట్లు) పట్టణ జనాభా ఉండగా, 2050 నాటికి ఇది రెట్టింపు అవుతుందని, 80 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తారని వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అంచనా వేస్తున్నది.
ఈ నేపథ్యంలో నగరాల్లో వేడిని తగ్గించడానికి నీటి వనరులను, పచ్చదనాన్ని పెంచాలని పేర్కొన్నది. వేడిని ఉత్పత్తి చేస్తున్న కాంక్రీట్ ఉపరితలం, వాహనాలు, పరిశ్రమలు, ఏసీ వంటి వాటి వినియోగం, నిర్వహణలో మార్గదర్శకాలు రూపొందించాలని పేర్కొన్నది. సాధారణంగా ఆరోగ్యపరమైన అత్యవసర చర్యలు తీసుకునేటప్పుడు కేవలం పగటిపూట ఉష్ణోగ్రతలనే పరిగణనలోకి తీసుకుంటున్నారని, రాత్రి ఉష్ణోగ్రతలు, తేమను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
ఇతర మెట్రో నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ పరిస్థితి మెరుగ్గా ఉంది. నగరంలో 2003లో 20.6 శాతంగా ఉన్న బిల్ట్అప్ ఏరియా 2023 నాటికి 44 శాతానికి పెరిగింది. 2003లో 8.9 శాతంగా ఉన్న పచ్చదనం 2023నాటికి ఏకంగా 26.5 శాతానికి పెరిగింది. గత పదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమం చేపట్టడం, అర్బన్ ఫారెస్టుల అభివృద్ధి వంటి ప్రయత్నాలు ఫలించినట్టు ఈ లెక్కలను బట్టి అర్థమవుతున్నది.
సాధారణంగా పగటి పూట వేడి కారణంగా భూఉపరితల ఉష్ణోగ్రత వేడెక్కుతుంది. రాత్రివేళ చల్లబడుతుంది. 2001 – 2010 మధ్య పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతతో పోలిస్తే 6.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 13.2 డిగ్రీల సెల్సియస్ వరకు భూఉపరితల ఉష్ణోగ్రత తగ్గేది. 2014 – 23 మధ్య మాత్రం 6.2 డిగ్రీల సెల్సియస్ నుంచి 11.5 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే రాత్రిపూట భూఉపరితల ఉష్ణోగ్రత తగ్గుతున్నదని సీఎస్ఈ పేర్కొన్నది.
More Stories
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు