ఎంఎల్‌సి కవితకు బెయిల్ ఇవ్వొద్దు

ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన అవినీతి, మనీ లాండరింగ్ కేసులలో బెయిల్ కోసం బిఆర్‌ఎస్ నాయకురాలు ఎంఎల్‌సి కవిత చేసిన అభ్యర్థనలను ఢిల్లీ హైకోర్టులో సిబిఐ, ఈడీ మంగళవారం వ్యతిరేకించాయి. ఆమె సాక్షులను ప్రభావితం చేయగల ‘అత్యంత పలుకుబడి ఉన్న, శక్తిమంతురాలు అయిన’ నాయకురాలని సిబిఐ, ఇడి సంస్థలు వాదించాయి. 

మహిళ అయినందున కవితను బెయిల్‌పై విడుదల చేయాలని ఆమె తరఫున న్యాయవాదులు చేసిన వాదనను దర్యాప్తు సంస్థలు తిప్పికొడుతూ, ‘కుంభకోణం’ వెనుక కుట్రలో ఆమె కీలక పాత్ర పోషించారని, క్రియాశీల రాజకీయ నాయకురాలు, తెలంగాణ శాసనమండలి సభ్యురాలు అయినందున ఆమె ‘దుర్బల’ మహిళతో పోలిక తీసుకురాకూడదని స్పష్టం చేశాయి.

ఇడి, సిబిఐ, కవిత తరఫున న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి స్వర్ణ కాంత శర్మ ఆమె బెయిల్ దరఖాస్తులపై ఉత్తర్వులను రిజర్వ్‌లో ఉంచారు. కవిత ‘కేవలం ఒక మహిళ కాదు. కానీ అత్యంత పలుకుబడి గల మహిళ’ అని, సాక్షులను ప్రభావితం చేయగల ‘శక్తిమంతురాలు’ అని, సాక్షులలో ఒకరు తనను ఆమె బెదరించిందని కూడా చెప్పారని విచారణ సమయంలో సిబిఐ న్యాయవాది పేర్కొన్నారు. 

నిందితురాలు ఇప్పటికే కొన్ని సాక్షాలను నాశనం చేశారని, తమ వాంగ్మూలాలను వెనుకకు తీసుకోవలసిందిగా సాక్షులను ఒత్తిడి చేశారని ఈడీ  న్యాయవాది ఆరోపించారు. ‘కవిత ఇతరులతో కలసి కుట్ర పన్నారు, రూ. 100 కోట్ల మేరకు ముడుపులు చెల్లింపులో చురుకుగా పాల్గొన్నారు, తరువాత మనీలాండరింగ్ ఎకోసిస్టమ్ అంటే ఆమె ప్రాక్సీ ద్వారా ఇండో స్పిరిట్స్ సంస్థ రూ. 192.8 కోట్ల మేరకు నిధులు సృష్టించింది. అటువంటి చర్యల ద్వారా కె కవిత రూ.292.8 కోట్ల మేరకు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్(పిఒసి)కి సంబంధించిన వివిధ ప్రక్రియలను, కార్యకలాపాల్లో పాల్గొన్నారు’ అని దర్యాప్తు సంస్థ తన కౌంటర్‌ అఫిడవిట్‌లో ఆరోపించింది.

ఈ నెల 6 నాటి విచారణ కోర్టు ఉత్తర్వును కవిత సవాల్ చేశారు. ఆ ఉత్తర్వు ద్వారా సిబిఐ అవినీతి కేసులో, ఈడీ  మనీ లాండరింగ్ కేసులో ఆమె బెయిల్ దరఖాస్తులను కొట్టివేయడమైంది. ఎక్సైజ్ వ్యవహారంలోని 50 మంది నిందితుల్లో ఆమె ఒక్కరే మహిళ అని ఆమె న్యాయవాది పేర్కొన్నారు. చట్టం మహిళలను విభిన్నంగా పరిగణిస్తున్నందున ఆమెకు బెయిల్ మంజూరు విషయాన్ని పరిశీలించాలని కోర్టును ఆయన కోరారు. 

కవిత పాత్ర గురించి ఈడీ  వివరిస్తూ, సహ నిందితుడు, ఆమె సహచరుడుగా భావిస్తున్న అరుణ్ రామచంద్రన్ పిళ్లై వాంగ్మూలాలు ఇండో స్పిరిట్స్ సంస్థలో ఆమె ప్రయోజనాలకు ఆయన ప్రాతినిధ్యం వహించినట్లు వెల్లడించాయని, ఢిల్లీ అధికార పార్టీకి రూ. 100 కోట్లు చెల్లించినందుకు ప్రతిగా కొన్ని టోకు సంస్థల్లో తనకు వాటాలు రావాలన్న షరతుతో ఆమెకు, ఆప్ నేతలకు మధ్య అవగాహనలో భాగంగా ఆ సంస్థ ఏర్పాటైందని తెలియజేసింది.

‘ఇండో స్పిరిట్స్‌లో అరుణ్ పిళ్లై వాటాకు అంతిమ ఇన్‌చార్జి కె కవిత అని, పాలసీ రూపకల్పన, ముడుపుల పథకం రూపకల్పన, ఇండో స్పిరిట్స్ ద్వారా సమకూరిన అంతిమ లాభాలు, పిఒసి సంబంధించిన కుట్రలో చురుకుగా పాల్గొన్నారని నిర్ధారితమైంది’ అని ఈడీ తెలిపింది. ఈడీ, సిబిఐ దాఖలు చేసిన రెండు కేసుల్లో కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇడి కవిత (46)ను మార్చి 15న హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని ఆమె నివాసంలో నుంచి అరెస్టు చేసింది.