కేజ్రీవాల్ బెయిల్ పొడిగింపు  పిటీషన్ కొట్టివేత

కేజ్రీవాల్ బెయిల్ పొడిగింపు  పిటీషన్ కొట్టివేత

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ ను పొడిగించాలంటూ వేసిన పిటిషన్‌ ను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది. అత్యవసరంగా విచారించాలని కేజ్రీవాల్‌ వేసిన బెయిల్‌ పిటిషన్‌ పై  న్యాయమూర్తి జస్టిస్‌ దత్తా స్పందిస్తూ అంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే ఈ పిటిషన్‌పై తదుపరి ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌కు పంపుతున్నట్లు వెకేషన్ బెంచ్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ మరి కొద్ది రోజుల్లో ముగిసిపోనుంది. అయితే, సిఎం కేజ్రీవాల్‌ తరపున కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వైద్యుల సలహాతోపాటు నిర్బంధంలో ఉన్న సమయంలో ఆయన అకస్మాత్తుగా ఏడు కిలోల బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యలను పేర్కొన్నారు. 

పఈటి-సిటి స్కాన్‌తో సహా అనేక వైద్య పరీక్షలు చేయవలసి ఉంటుంది. దీనికి ఐదు-ఏడు రోజులు పట్టవచ్చు అని కేజ్రీవాల్‌ తన పిటిషన్‌ లో వెల్లడించారు. వైద్య పరీక్షల దృష్యా తన మధ్యంతర బెయిల్‌ను వారం రోజుల పాటు పొడిగించాలని, జూన్‌ 2న కాకుండా జూన్‌ 9వరకు అనుమతించాలని కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. 

కానీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్‌ ఇచ్చింది. కాగా, తన ఆరోగ్య పరిస్థితుల దృష్యా బెయిల్‌ ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్‌ వేసిన ఆ పిటీషన్‌ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఢిల్లీలో జరిగిన మద్యం పాలసీ కుంభకోణంలో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టయ్యారు. కొద్ది రోజుల క్రితం, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు మే 10 నుంచి జూన్‌ 1 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరైంది.