మధ్యంతర బెయిల్ పై జైలు నుండి విడుదలై వచ్చిన ఢిల్లీ ల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. ఆ తేదీ సమీపిస్తున్న తరుణంలో తనకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పీఈటీ- సీటీ స్కాన్ సహా పలు వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉన్నందున మరో వారం రోజుల పాటు తన మధ్యంతర బెయిల్‌ను పొడిగించాలని న్యాయస్థానాన్ని ఆదివారం ఆయన కోరారు.
ఆరోగ్య సమస్యల వల్ల తాను ఏడు కేజీల బరువు తగ్గానని, కీటోన్ లెవల్స్ చాలా పెరిగిపోవడం వల్ల ఆందోళనకు గురవుతున్నానని ఈ పిటిషన్లో కేజ్రీవాల్ ప్రస్తావించారు. అందుకే తాను పీఈటీ – సీటీ స్కాన్ వంటి కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. పీఈటీ- సీటీ స్కాన్ ద్వారా మన శరీర అవయవాలు, కణజాలాల వివరణాత్మక ఫొటోలను తీయొచ్చు. వీటి ఆధారంగా వైద్యులు తదుపరి చికిత్సను అందిస్తారు. అయితే కేజ్రీవాల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఏవిధంగా పరిగణిస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కాగా, డిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత ఆతిశీ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్య సమస్యపై అనుమానం వ్యక్తం చేశారు. “కేజ్రీవాల్ ఇప్పటికే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వాటి ఆధారంగా ఆయనకు కీటోన్ స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. జైలులో ఉండగా తగ్గిపోయిన 7 కేజీల బరువు ఇంకా పెరగలేదు. కీటోన్ స్థాయులు పెరగడం అనేది తీవ్రమైన వ్యాధుల లక్షణం. ఆయన కిడ్నీలలో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి ఉండొచ్చు. క్యాన్సర్ వచ్చిన వారిలోనూ ఈ తరహా లక్షణాలు కనిపిస్తాయి” అని ఆతిశీ పేర్కొన్నారు. ఇలాంటి విషమ పరిస్థితులు ఉన్నందు వల్లే బెయిల్ గడువును పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్ వేశారని ఆమె చెప్పారు.
లోక్‌సభ ఎన్నికల్లో తన రాజకీయ పార్టీ ఆప్ తరఫున ప్రచారం చేసేందుకు సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దిల్లీ లిక్కర్ స్కాం కేసులో దాదాపు 50 రోజుల కస్టడీ తర్వాత బెయిల్‌తో కేజ్రీవాల్‌కు తాత్కాలిక ఊరట లభించింది. బెయిల్ గడువు జూన్ 1న ముగియనుంది. జూన్ 2న మధ్యాహ్నంలోగా తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని గతంలో సుప్రీంకోర్టు ఆయనకు నిర్దేశించింది.
జైలు నుంచి తప్పించుకునేందుకే కేజ్రీవాల్ డ్రామాలు
బెయిల్ గడువును పొడిగించాలంటూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఘాటుగా స్పందించారు. జైలు నుంచి తప్పించుకునేందుకు కేజ్రీవాల్ డ్రామాలు మొదలుపెట్టారని ఆయన విమర్శించారు.
“ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేశాడు. అదంతా జరిగిపోయాక కేజ్రీవాల్‌కు తీవ్ర ఆరోగ్య సమస్యలు మొదలుకావడం విడ్డూరంగా ఉంది. అదే నిజమైతే కేజ్రీవాల్ పంజాబ్ ఎన్నికల ప్రచారాన్ని ఆపేసి- వైద్య పరీక్షలు ఎందుకు చేయించుకోవడం లేదు ?” అని సచ్‌దేవా ప్రశ్నించారు.

More Stories
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం