ఇజ్రాయిల్ దాడుల్లో రఫాలో 45 మంది అగ్నికి ఆహుతి

ఇజ్రాయిల్ దాడుల్లో రఫాలో 45 మంది అగ్నికి ఆహుతి

గాజా సిటీలోని రఫా ప్రాంతం ఇజ్రాయెల్ విమానాల బాంబుదాడులతో తల్లడిల్లింది. దాడులతో తలెత్తిన మంటలలో ఓ టెంట్ తగులబడిపోయింది. ఇందులోని దాదాపు 45 మంది బుగ్గి అయ్యారు. సోమవారం జరిగిన ఈ భయానక దాడిలో , తరువాతి మంటలలో చనిపోయింది ఎక్కువగా శరణార్థులే అని వెల్లడైంది. 45 మందికి పైగా దుర్మరణం చెందారని, మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని రఫా అధికారులు తెలిపారు.

మరో 60 మంది గాయపడ్డారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రాంతంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఉత్తర, మధ్య గాజా నుంచి కట్టుబట్టలతో తరలివచ్చిన పాలస్తీనియన్లు అక్కడ గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నారు. అలాంటి సురక్షిత ప్రాంతంపై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.

రఫాపై దాడి విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. తప్పు చేశామని పార్లమెంటులో అంగీకరించారు. సాధారణ పౌరులకు ఎలాంటి హాని చేయకూడదని అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఈ విషాద ఘటన జరిగిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ప్రకటించారు.

రఫాపై చేసిన దాడిని ఇజ్రాయెల్‌కు అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, ఫ్రాన్స్ సహా స్పెయిన్ , ఇటలీ, ఐర్లాండ్, నార్వే, ఈజిప్టు, ఖతార్ తుర్కియే ఖండించాయి. అటు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కూడా ఈ దాడిని తప్పుబట్టారు. ఈ ఘటన వల్ల అనేక మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారని, వెంటనే ఈ దాడులను ఆపాలని పేర్కొన్నారు.

రఫాపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఓ వైపు ప్రపంచ న్యాయస్థానం పిలుపు నిచ్చింది. ఈ దశలోనే ఇజ్రాయెల్ వీటిని పట్టించుకోకుండా వైమానిక దాడులను ఉధృతం చేసింది. ఇజ్రాయెల్ వెంటనే సంయమనం పాటించాలని , ప్రపంచ న్యాయస్థానం రూలింగ్‌ను పాటించాలని ప్రపంచ స్థాయి నేతలు సోమవారం ప్రకటనలు వెలువరించారు. 

ఎనిమిది నెలలుగా సాగుతున్న రక్తపాతం, సామాన్యుడి హాహాకారాల నడుమ రఫా ప్రాంతం ఇప్పుడు ఇజ్రాయెల్ నైపుణ్య సేనల దాడులతో నెత్తుటి ఆక్రందనలతో మార్మోగుతోంది. ఆదివారం రాత్రి తరువాత ఇజ్రాయెల్ సైనిక విమానాలు భీకర రీతిలో దాడులకు దిగాయి. దీనితో ఓ చోట టెంటుకు నిప్పంటుకుంది. టెంట్‌లోని తమ వారు బూడిదైన క్రమంలో వారిని అంత్యక్రియలకు తరలించేందుకు పాలస్తీనియన్లు తెల్లవారుజామున ఈ ప్రాంతానికి ఉరుకులుపరుగులపై వెళ్లారు.