
కేసీఆర్ వేసిన ఎత్తుగడ పోలీసుల వైఫల్యంతో విఫలమైన్నట్లు చెప్పారు. అదొక్కటే కాదు తన నేరాంగీకార వాంగ్మూలం (కన్ఫెషన్ స్టేట్‌మెంట్)లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పలు సంచలన అంశాలను వెల్లడించారు. పోలీసులను పావుగా వాడుకుని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అమలుచేసిన అనేక ఎత్తులు బయటపడుతున్నాయి.
ముఖ్యంగా నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి పలు కొత్త విషయాలను రాధాకిషన్‌రావు తన వాంగ్మూలంలో వెల్లడించారు. దాని ప్రకారం మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్‌ఎ్‌సకు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ యత్నించిందని ఇప్పటివరకూ చాలామంది అనుకుంటున్నారు.
కానీ వాస్తవానికి బీజేపీ పైలెట్ రోహిత్ రెడ్డితో మాత్రమే సంప్రదింపులు జరిపింది. అయితే, ఈ విషయం కేసీఆర్‌కు తెలియడంతో .. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యేలను ఇందులో భాగం చేయాలని ఆదేశించినట్టు రాధాకిషన్‌రావు తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలకంగా ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ ను అరెస్టు చేసి కవితను లిక్కర్ స్కామ్ నుంచి తప్పించడానికి కేంద్రంతో బేరసారాలు ఆడాలన్నది కేసీఆర్ ఎత్తుగడ అని ఆయన వివరించారు. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్ కేరళలోని మాతా అమృతానందమయి ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న వ్యకిని అరెస్టు చేసేందుకు సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు కేరళకు వెళ్లగా అయన తప్పించుకున్నారు.
దీంతో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి, ఇన్‌స్పెక్టర్ గట్టుమల్లుతోపాటు, ఇతర అధికారులను చార్టర్డ్ విమానంలో కేరళకు పంపారు. అయినా ప్లాన్ వర్కవుట్ కాలేదు. అంతలోన న్యాయస్థానం ఈ కేసును సిట్ నుంచి బదిలీ చేసి సీబీఐకి అప్పగించింది.
ఈ సమయంలో అనుకున్న విధంగా పని జరగకపోవడంతో పెద్దాయన (కేసీఆర్) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని రాధాకిషన్ తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. కాగా, ఈ సమయంలో మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడి బీజేపీలో చేరారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచి ఊపుమీద ఉన్న బీజేపీని మునుగోడులో ఓడించాలని కేసీఆర్ ఆ సీటును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారని తెలిపారు.
ఇదే సమయంలో.. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో బీజేపీకి చెందిన కొందరు టచ్‌లోకి వెళ్లారని, పార్టీ మారేందుకు ఆయన్ను ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ నుంచి సమాచారం వచ్చిందని ప్రభాకర్ రావు నాతో చెప్పారు. బీజేపీని ఇరుకున పెట్టే అవకాశాన్ని వదులుకోవడం ఇష్టంలేని కేసీఆర్ ఎమ్మెల్యేతోపాటు బీజేపీ నాయకుల ఫోన్‌లు ట్యాప్ చేయాలని సూచించారు.
ఈ పనిని ప్రణీత్ రావుకు అప్పగించారు. వారి ఫోన్లు ట్యాప్ చేయడంతోపాటు కొన్ని ఆడియో క్లిప్‌లను సేకరించి పంపాడతడు. అవే ఆడియో క్లిప్‌లను సీఎం కేసీఆర్‌కు ఇచ్చాము. తమకు అనుకూలంగా పనిచేయాలంటూ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని సూచించిన సీఎం కేసీఆర్, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకుల చుట్టూ ఉచ్చు బిగించాలని పథకం వేశారు.
ఇందులో భాగంగానే కేసీఆర్ ఆదేశాలతోనే పైలెట్ రోహిత్ రెడ్డి మరో ముగ్గురు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేతల తరఫున వచ్చిన నేతలతో సంప్రదింపులు జరిపారు. వీరి వ్యవహారం రికార్డ్ చేసేందుకు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సై శ్రీకాంత్‌ను ఢిల్లీ పంపి కెమెరాలను తెప్పించి, సమావేశానికి ఒకరోజు ముందు ఫామ్‌హౌ్‌సలో బిగించారని రాధాకిషన్ రావు వివరించారు.
పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును గత ప్రభుత్వ పెద్దలు కావాలనే ఇంటెలిజెన్స్ చీఫ్‌గా (ఓఎస్డి) నియమించినట్టు రాధాకిషన్‌రావు వెల్లడించారు. ‘‘ఆయన ఇంటెలిజెన్స్‌కు వచ్చిన తర్వాతే.. నాతో సహా ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను ఇంటెలిజెన్స్, ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్‌కు తీసుకొచ్చారు. నాది కూడా అదే సామాజిక వర్గం కావడంతో అప్పటి ప్రభుత్వం నాకు మూడేళ్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ (ఓఎ్‌సడీ)గా అవకాశం ఇచ్చింది’’ అని తెలిపారు.
ముఖ్యంగా భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు, వేణుగోపాల్ రావు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసుకొని లీడ్ చేశారని చెప్పారు. టాస్క్‌ఫోర్స్‌పరంగా తాను మొత్తం వ్యవహారం దగ్గరుండి నడిపించానని రాధాకిషన్ రావు తెలిపారు.
బీఆర్‌ఎస్‌ను మళ్లీ గెలిపించాలని
2023లో బీఆర్‌ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఎస్‌ఐబీ, టాస్క్‌ఫోర్స్ టీమ్‌లు అహర్నిశలూ కృషి చేసినట్టు రాధాకిషన్‌రావు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారంతో ప్రత్యర్థి పార్టీల నాయకులకు ఆర్థికంగా అండగా నిలిచిన వ్యాపారులను గుర్తించి వారిని ఆర్థికంగా దెబ్బతీసేవాళ్లమని, వారికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకొని, దాన్ని అడ్డుకొని సీజ్ చేసేవాళ్లమని వివరించారు.
అలాగే.. బీఆర్‌ఎస్ గెలుపును అడ్డుకునేవారు, పార్టీ మనుగడకు ఇబ్బందికరంగా మారిన కొంతమంది ప్రముఖులతో పాటు, పార్టీలోనే ఉన్నా అసంతృప్తితో రగిలిపోతున్న అనుమానితుల ఫోన్‌లూ ట్యాప్ చేసి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పెద్దాయనకు చేరవేశామని రాధాకిషన్‌రావు పోలీసులకు వెల్లడించారు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేతో విభేదాలున్న శంబీపూర్ రాజుపైన, కడియం శ్రీహరితో విభేదాలున్న రాజయ్యపైనా, తాండూరు ఎమ్మెల్యేతో పట్నం మహేందర్‌రెడ్డి దంపతులకు విభేదాలు ఉండటంతో వారిపైనా, రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, తీగల కృష్ణారెడ్డి, తీన్మార్ మల్లన్న, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సరిత తిరుపతయ్య, జువ్వాడి నర్సింగరావు, వంశీకృష్ణ, కవ్వంపల్లి సత్యనారాయణ ఫోన్‌లపై నిఘాపెట్టి ట్యాప్ చేశామని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు.
బీజేపీ నేతలు ఈటల, బండి సంజయ్, ఎంపీ అరవింద్ అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని వారితో పాటు, ఎన్టీవీ చైర్మన్ ఫోన్లు ట్యాప్ చేసినట్లు రాధాకిషన్‌రావు వాంగ్మూలమిచ్చారు. మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు ప్రణీత్‌రావుతో డైరెక్ట్‌గా టచ్‌లోకి వెళ్లి ఐన్యూస్ ఎండీశ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ నవీన్ రావు అందించిన సమాచారంతో పలువురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త సునిల్ కనుగోలునూ ప్రణీత్‌రావు టార్గెట్ చేసి, కేసులు నమోదుచేశారని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు
More Stories
కోల్‌కతాలో భారీ వర్షం… విద్యుత్ షాక్ లకు 9 మంది మృతి
మల్లోజుల వేణుగోపాల్ ద్రోహి.. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం