పిన్నేల్లికి మరో మూడు కేసులలో ముందస్తు బెయిల్

పిన్నేల్లికి మరో మూడు కేసులలో ముందస్తు బెయిల్

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎపి హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈవిఎం ధ్వంసం కేసులో బెయిల్‌ మంజూరైన తర్వాత నమోదైన కేసుల్లో సైతం ముందస్తు బెయిల్‌ మంజూరైంది. మంగళవారం ఉదయం మూడు కేసుల్లో పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఈవిఎం ధ్వంసం కేసులో విధించిన షరతులే ఈ కేసుల్లో కూడా వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది. జూన్‌6 వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్ట్‌ చేయొద్దని న్యాయస్థానం ఆదేశించింది. మే13వ తేదీన మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేట్‌ పోలింగ్‌బూత్‌లో ఈవిఎం ధ్వంసం చేసిన ఘటనలో పిన్నెల్లి గతవారం పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే ఉద్దేశంతో పరారయ్యారు. 

ఆ తర్వాత ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. కౌంటింగ్‌ జరిగే వరకు పోలీసులు చర్యలు తీసుకోకుండా ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు పిన్నెల్లిపై మరికొన్ని కేసులు నమోదు చేశారు. హత్యాయత్నం సహా, పోలీసులపై దాడి కేసు నమోదు చేశారు.

పాల్వయిగేటు పోలింగ్‌ బూత్‌లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడారు. ఈవీఎం ధ్వంసం చేసి బయటకు వస్తున్న సమయంలో ఓ మహిళపై దుర్భాషలాడారు. కారంపూడిలో సీఐపై దాడి చేసిన ఘటనలో ఎమ్మెల్యే పిన్నెల్లిపై కేసు నమోదైంది. 

ఈ మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మూడు కేసుల్లో హైకోర్టులో సోమవారం వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును మంగళవారానికి రిజర్వ్‌ చేశారు. 23వ తేదీన పోలీసులు కేసు నమోదు చేయగా, 22వ తేదీన కేసులు నమోదు చేసినట్లు వివరాలున్నాయని పిన్నెల్లి తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే పిన్నెల్లికి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

కాగా పాల్వాయిగేటు పోలింగ్‌ బూత్‌లో ఈవీఎం ద్వంసం కేసులో జూన్‌ 6 వరకు అరెస్టు చేయవద్దని గతంలో హైకోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా పిన్నెల్లి కదలికలపై ఆంక్షలు విధించింది. కౌంటింగ్​ కేంద్రానికి వెళ్లడానికి ఓట్ల లెక్కింపు రోజు మాత్రమే హైకోర్టు అనుమతించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని పేర్కొంది.