గాజా స్ట్రిప్ నుంచే భారీ క్షిపణులను లాంచ్ చేసినట్లు హమాస్‌కు చెందిన అల్-అక్సా టీవీ పేర్కొంది. కాగా, దక్షిణ గాజాలోని రఫా ప్రాంతం నుంచి హమాస్ కనీసం ఎనిమిది రాకెట్లను ప్రయోగించినట్లు బీబీసీ తెలిపింది. అయితే ఇజ్రాయెల్ ఆర్మీ ఈ రాకెట్లను అడ్డుకున్నదని పేర్కొంది. ఇజ్రాయెల్ సెంట్రల్ సిటీ టెల్ అవీవ్, హెర్జ్లియా, పెటా టిక్వాతో సహా పలు నగరాలు, పట్టణాలలో ప్రజలను హెచ్చరించే సైరన్‌లు మోగాయని వెల్లడించింది.మరోవైపు హమాస్ తాజా దాడిలో ఇజ్రాయెల్‌కు ఎలాంటి నష్టం జరిగిందో అన్నది వెల్లడి కాలేదు. అయితే ఏడు నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పటికీ ఆ దేశంపై రాకెట్లను ప్రయోగించే సత్తా తమకు ఉన్నదని హమాస్ తాజా దాడి సూచిస్తున్నది.
మరోవంక, ఇరాన్ మద్దతున్న హెజ్‌బొల్లా ఇజ్రాయెల్‌కు హెచ్చరికలు జారీ చేసింది. త్వరలో తమ నుంచి ‘సర్‌ప్రైజ్’ అందుకోబోతున్నది అంటూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. సర్‌ప్రైజ్ అందుకునేందుకు సిద్ధంగా ఉండాలంటూ హెజ్‌బొల్లా సెక్రటరీ జనరల్ హసన్ నస్రల్లాహ్ అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లెబనాన్‌కు చెందిన ఉగ్ర సంస్థ ఇజ్రాయెల్‌పై మెరుపు దాడులకు సిద్ధమవుతున్నదని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
ఇప్పటి వరకు జరిగిన పోరులో తాము ఏమీ సాధించలేకపోయామని స్వయంగా ఇజ్రాయెల్ అంగీకరించిందని నస్రల్లాహ్ తన సందేశంలో పేర్కొన్నారు. పైగా ఐరోపా దేశాలు పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం వారికి పెద్ద ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు. హమాస్ పోరాటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. గాజా, రఫాలో ఇజ్రాయెల్ అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలను పాటించడం లేదని ఆరోపించారు. అంతర్జాతీయ కోర్టు ఆదేశించినప్పటికీ రఫాలో దాడులకు పాల్పడుతున్నదని వెల్లడించారు. ఇజ్రాయెల్‌లో పోరులో పాలస్తీనకు మద్దతుగా హెజ్‌బొల్లా పాల్గొంటున్న విషయం తెలిసిందే.

More Stories
అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై భారత్ తొందర పడదు!
ఆసియాన్ సదస్సులో వర్చువల్ గా మోదీ
రష్యా చమురు సంస్థలపై ట్రంప్ ఆంక్షలు