కాలం చెల్లిన అమెరికా హెలికాప్ట‌ర్‌ ఇరాన్ అధ్య‌క్షుడి ప్రాణం తీసిందా !

కాలం చెల్లిన అమెరికా హెలికాప్ట‌ర్‌ ఇరాన్ అధ్య‌క్షుడి ప్రాణం తీసిందా !

ఇరాన్ అధ్య‌క్షుడు ఇబ్ర‌హీం రైసీ ప్ర‌యాణించిన హెలికాప్ట‌ర్ చాలా పురాత‌న‌మైంది. బెల్ 212 హెలికాప్ట‌ర్ బ‌హుశా 1960 ద‌శ‌కంలో త‌యారైన‌ట్లు తెలుస్తోంది. ఇరాన్ విప్ల‌వోద్య‌మం కంటే ముందే ఆ హెలికాప్ట‌ర్‌ను అమెరికా వ‌ద్ద కొనుగోలు చేసిన‌ట్లు అంచనా వేస్తున్నారు. 1960 ద‌శ‌కం నుంచి ఆప‌రేటింగ్‌లో ఉన్న ఆ హెలికాప్ట‌ర్‌కు ప్ర‌స్తుతం స్పేర్ పార్టులు దొర‌క‌డం క‌ష్ట‌మే. 

అయితే హెలికాప్ట‌ర్ కూల‌డానికి స్పేర్ పార్టులు దొర‌క‌క‌పోవ‌డమే కార‌ణ‌మై ఉంటుంద‌ని అమెరికా మిలిట‌రీ విశ్లేష‌కుడు సెడ్రిక్ లీట‌న్ తెలిపారు. షా పాల‌న స‌మ‌యంలో ఇరాన్‌లో బెల్ 212 హెలికాప్ట‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టారు. 1976లో దీన్ని క‌మ‌ర్షియ‌ల్ వాడ‌కం కోసం తీసుకున్నారు. అమెరికా మిలిట‌రీలో కూడా ఆ హెలికాప్ట‌ర్‌ను వాడిన‌ట్లు తెలుస్తున్నది. 

1960 నుంచి వాడ‌కంలో ఉన్న ఆ హెలికాప్ట‌ర్ల‌కు ప్ర‌స్తుతం స్పేర్ పార్టులు దొర‌క‌వ‌ని మిలిట‌రీ విశ్లేష‌కుడు చెప్పాడు. ఇక వాయవ్య‌ ఇరాన్‌లో గ‌త కొన్ని రోజులుగా ఉన్న వెద‌ర్ కూడా కీల‌క అంశంగా మారింది. ద‌ట్ట‌మైన మంచు, వ‌ర్షం, అతిశీత‌ల వాతావ‌ర‌ణం వ‌ల్ల కూడా హెలికాప్ట‌ర్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు ఉత్పన్నమై ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు.

బెల్ హెలికాప్ట‌ర్ కంపెనీని ఇప్పుడు బెల్ టెక్స్‌ట్రాన్ అని పిలుస్తున్నారు. అయితే బెల్ 212 హెలికాప్ట‌ర్‌ను కెన‌డా మిలిట‌రీ కోసం 1960లో డెవ‌ల‌ప్ చేశారు. యూహెచ్‌-1 ఇరోకుస్‌కు అప్‌గ్రేడ్‌గా దీన్ని త‌యారు చేశారు. కొత్త డిజైన్‌లో రెండు ట‌ర్బో ఇంజిన్లు ఉన్నాయి. 1971లో బెల్ హెలికాప్ట‌ర్‌ను అమెరికా, కెన‌డా మిలిట‌రీలో ద‌త్త‌త తీసుకున్నాయి.

బెల్ 212ను యుటిలిటీ హెలికాప్ట‌ర్‌గా పిలుస్తారు. అన్ని సంద‌ర్భాల‌కు త‌గిన‌ట్లు దీన్ని వాడుకోవ‌చ్చు. ప్ర‌యాణికుల‌ను త‌ర‌లించేందుకు, ఏరియ‌ల్ ఫైర్‌ఫైటింగ్ కోసం, కార్గో, ఆయుధాల త‌ర‌లింపుకు దీన్ని వాడుతుంటారు. అయితే ఇరాన్‌లో కూలిన ఆ హెలికాప్ట‌ర్ మోడ‌ల్‌ను ప్ర‌భుత్వ ప్యాసింజెర్ల‌ను తీసుకెళ్లేందుకు డిజైన్ చేశారు.

బెల్ 212 హెలికాప్ట‌ర్‌ను జ‌పాన్ కోస్టుగార్డు, అమెరికా భ‌ద్ర‌తా ద‌ళాలు, అగ్నిమాప‌క శాఖ వాడుతోంది. థాయిలాండ్ జాతీయ పోలీసులు కూడా దీన్నే వాడుతున్నారు. అయితే ఇరాన్ స‌ర్కారు వ‌ద్ద ఎన్ని బెల్ 212 హెలికాప్ట‌ర్లు ఉన్నాయో తెలియ‌దు. కానీ ఆదేశ వైమానిక ద‌ళం, నేవీ వ‌ద్ద 10 హెలికాప్ట‌ర్లు ఉన్నారు.