రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మారలేదు

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలన మారలేదు

గత రాష్ట్ర ప్రభుత్వం తీరుగానే కాంగ్రెస్ సర్కార్‌ పాలన కొనసాగిస్తుందని, మార్పు ఎక్కడ కనిపించట్లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ విమర్శించారు. అమలు కానీ అనేక హామీలను కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి విస్మరిస్తుందని మండిపడ్డారు. 

కానీ ప్రధాని మోదీ దేశం ముఖ్యం అని భావించి, ప్రపంచంలో దేశాన్ని మంచి స్థానంలో పెట్టాలని కృషి చేస్తున్నారని పవర్ ఓరియెంటెడ్ కాకుండా పీపుల్స్ ఓరియెంటెడ్ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. అందువల్లే పదేళ్ల పాలన తర్వాత కూడా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అని దేశ ప్రజలు నినదిస్తున్నారని చెప్పారు. 

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మేధావులంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. నరేంద్ర మోదీ సంకీర్ణ రాజకీయాలకు స్వస్తి పలికారని, భారత్ ఇప్పుడు ఐదవ ఆర్థిక వ్యవస్థకు తీసుకు వచ్చారని చెప్పారు. దీనిని మూడో స్థానానికి తీసుకురావడమే లక్ష్యంగా మోదీ పని చేస్తున్నట్లు చెప్పారు.

 నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న విధంగా గోకుల్ చాట్ బాంబు దాడులు, సరిహద్దుల్లో సైనికుల మృతులు నేడు ప్రధాని పాలనలో లేవని తెలిపారు. నాడు సంకీర్ణ రాజకీయాల్లో ఎన్ని స్కామ్‌లు జరిగాయో అందరికీ తెలుసు. కోల్‌ స్కాం, 2జీ స్కాం, భోపాల్ స్కాం మొదలగు అవినీతి చర్యలన్నీ సంకీర్ణ రాజకీయాలు దేశాన్ని పాలించినప్పుడు జరిగినవే. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీనే ప్రధాన పార్టీ.” అని గుర్తు చేశారు.

 పార్లమెంటు ఎన్నికల్లో ఎవరు ఊహించని, ఏ సర్వే సంస్థలు చెప్పలేని ఫలితాలు వస్తాయని ఈటల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈ జిల్లా ఆ జిల్లా అంటూ తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ కమలానికే ఓటు వేశారని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాకు వచ్చిన ఆయన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గెలుపుకోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయనున్నట్లు వెల్లడించారు.

 కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఆరు నెలలకే ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు తప్ప ఇంకేమైనా చేసిందా? అని ప్రశ్నించారు. మహిళలకు రూ.2500, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని, కనీసం రూపాయి ఖర్చు లేని రేషన్‌కార్డు కూడా ఇవ్వలేక పోయిందని హస్తంపై మండి పడ్డారు.