
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (63) హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ప్రాంతంలో ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవని ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. హెలికాప్టర్ కూలిన ప్రాంతం మొత్తం కాలిపోయిందని తెలిపింది. అందులో అధ్యక్షుడు రైసీతోపాటు విదేశాంగ మంత్రి అబ్దొల్లాహియాన్, అజర్ బైజాన్ గవర్నర్, ఇతర ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్నారు.
అధ్యక్షుడు ఇబ్రహిం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం సాయంత్రం అజర్‌బైజన్ సరిహద్దుల్లోని జోల్ఫాలో కుప్పకూలిన విషయం తెలిసిందే. అజర్‌బైజాన్ సరిహద్దులో ఇరు దేశాలు సంయుక్తంగా నిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవానికి వెళ్లిన అధ్యక్షుడు, తిరుగు ప్రయాణంలో తబ్రిజ్ నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.
భారీ పొగమంచు మధ్య పర్వతప్రాంతాలను దాటుతుండగా హెలికాప్టర్ కుప్పకూలిందని ఇరాన్ అధికారులు తెలిపారు. అయితే ఎత్తయిన కొండలు, ప్రతికూల వాతావరణం నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటకం ఏర్పడింది. దీంతో సోమవారం ఉదయం రెస్క్యూ బృందాలు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అంతకుముందు మానవ రహిత విమానాల ద్వారా హెలికాప్టర్ కూలిన ప్రదేశాలను గుర్తించారు.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత్-ఇరాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవడంలో ఆయన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో ఇరాన్‌కు భారత్ అండగా నిలుస్తుందని చెప్పారు.
ఇరాన్‌లో మతతత్వ పాలనకు గట్టి మద్దతుదారుగా రైసీ నిలిచారు. ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీకి అత్యంత సన్నిహితుడు, ఆయనకు వారసుడిగా రైసీ గుర్తింపు పొందారు. 1988లో ఖైదీలను సామూహికంగా ఉరితీసినందుకు అమెరికా, ఇతర దేశాల నుంచి ఆయన ఆంక్షల్ని ఎదుర్కొంటున్నారు.
గతంలో ఇరాన్ న్యాయవ్యవస్థను నడిపారు. 2021 అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థులందర్నీ పక్కకు తప్పించి, తక్కువ ఓటింగ్‌తో రైసీ గెలుపొందటం వివాదాస్పదమైంది. అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో నైతిక చట్టాల్ని కఠినతరం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేశారు. ప్రపంచ దేశాలతో అణు చర్చల్లో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా మారుస్తానని పదేపదే చెప్పేవారు.
కాగా, రైసీ దుర్మరణంతో ఇరాన్ తదుపరి అధ్యక్షుడి రేసులో ప్రస్తుత ఉపాధ్యక్ష పదవిలో కొనసాగుతున్న మొహమ్మద్ మొఖబర్ ముందంజలో ఉన్నారు. ఇరాన్ సుప్రిమో అయాతుల్లా అలీ ఖమేనీ ఆమోదం తెలపాల్సి ఉంది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక