ఆరు నెలల్లో భారత్ లో భాగం కానున్న ఆక్రమిత కాశ్మీర్

ఆరు నెలల్లో భారత్ లో భాగం కానున్న ఆక్రమిత  కాశ్మీర్
ప్రధాని  నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని పదవి చేపట్టగానే ఆరు నెలల్లో ఆక్రమిత కాశ్మీర్ భారత్ లో భాగం కానున్నదని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. మహారాష్ట్రలోని పాల్గర్ లో శనివారం ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ఆక్రమిత కాశ్మీర్ ను అట్టిపెట్టుకోవడంలో పాకిస్థాన్ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని చెప్పారు.
 
“పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను కాపాడుకోవడం పాకిస్థాన్‌కు కష్టంగా మారింది. ప్రధాని మోదీని మూడోసారి ప్రధానిగా చేయనివ్వండి, ఆరు నెలల్లో పీఓకే భారతదేశంలో భాగమవుతుంది. అలాంటి పనికి ధైర్యం కావాలి’’ అని సీఎం యోగి తెలిపారు.  ముఖ్యంగా, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇటీవలి రోజుల్లో ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా అపూర్వమైన ప్రదర్శనలను చూసింది. నిరసనలు స్థానిక ప్రజలు, పాకిస్తానీ దళాల మధ్య ఘర్షణలుగా మారాయి. 
 
“నక్సలిజం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దృఢమైన వైఖరిని కూడా సీఎం యోగి ప్రస్తావించారు. ‘‘గత 10 ఏళ్లలో కొత్త భారత్‌ను చూశాం. సరిహద్దుల్లో భద్రత కల్పించాం. ఉగ్రవాదం, నక్సలిజం అరికట్టాం” అని ఆదిత్యనాథ్ తెలిపారు.  ముంబై పేలుళ్లు జరిగినప్పుడు కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉగ్రవాదులు సరిహద్దు ఆవల నుంచి వచ్చారని చెబుతుండేది. అప్పుడు మీ క్షిపణి వల్ల ఉపయోగం ఏమిటి? అని యోగి ప్రశ్నించారు.
 
పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల హత్యలపై ఇటీవల భారత్‌పై వచ్చిన ఆరోపణలపై యూపీ సీఎం మాట్లాడుతూ.. ‘‘గత మూడేళ్లలో పాకిస్థాన్‌లో చాలా మంది ఉగ్రవాదులు హతమయ్యారని, భారత ఏజెన్సీల హస్తం ఉందని ఓ పెద్ద బ్రిటీష్ పత్రిక రాసింది. మన శత్రువులను ఎవరైనా చంపితే మేము వారిని పూజించము.  కాని వారికి తగిన సమాధానం ఇస్తాము” అని స్పష్టం చేశారు.

పాకిస్తాన్‌కు అనుకూలంగా మాట్లాడేవారంతా ఆ దేశానికి వెళ్లిపోయి ఆ దేశంలో భిక్షాటన చేసుకోవాలని యోగి స్పష్టం చేశారు. ఆ దేశాన్ని కీర్తించే వారికి భారత్‌లో చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌లో తింటూ పాకిస్తాన్ భజన చేసేవారికి ఈ దేశంలో స్థానం లేదని ఆయన చెప్పారు.

కాంగ్రెస్, ఇండియా కూటమిలను లక్ష్యంగా చేస్తుకుంటూ  వారి పాలనలో పేదలు ఆకలితో చనిపోతున్నారని, మరోవైపు ప్రధాని మోదీ  80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తున్నారని గుర్తు చేశారు. “పాకిస్తాన్‌ను పొగిడే వారికి, పాకిస్తాన్ మొత్తం జనాభా కంటే ఎక్కువ మందిని ప్రధాని మోదీ  పేదరికం నుండి బయటికి తెచ్చారని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను. వారు భారతదేశంలో నివసించినట్లయితే వారు ఆకలితో చనిపోరు. ఉచిత రేషన్ పొందేవారు” అని ఆడియనాథ్ చెప్పారు.
 
అంతేకాకుండా, మనం మెరుగైన భారతదేశాన్ని తయారు చేయాలనుకుంటే, ప్రతి ఒక్కరి మనోభావాలను గౌరవించాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పారు.  “భారతదేశంలోని గొప్ప వ్యక్తులను గౌరవించాలి. ప్రతి కుమార్తెకు పూర్తి భద్రత కల్పించాలి. ప్రతి వ్యాపారవేత్తకు రక్షణ కల్పించాలి.  ప్రతి యువకుడికి ఉపాధి కల్పించాలి” అని సీఎం యోగి చెప్పుకొచ్చారు. 

ఔరంగజేబు ఆత్మ కాంగ్రెస్‌లో చొరబడింది

వారసత్వ పన్నును ప్రవేశపెట్టాలన్న కాంగ్రెస్ ఆలోచనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి విమర్శలు గుప్పిస్తూ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆత్మ కాంగ్రెస్ పార్టీలో చొరబడినట్లు ఉందని ఎద్దేవా చేశారు.  నాసిక్ జిల్లాలోని మాలెగావ్ పట్టణంలో ఒక ఎన్నికల ప్రచార సభలో యోగి ప్రసంగిస్తూ తమ పార్టీ కేవలం అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, దేశాభివృద్ధి తమ పార్టీ లక్ష్యమని చెప్పారు.

 ప్రధానిగా మరోసారి నరేంద్ర మోదీ  బాధ్యతలు చేపట్టడం నిస్సందేహమని, బిజెపి, ఎన్‌డిఎ మిత్రపక్షాలు దేశానికి భద్రతను సమకూరుస్తాయని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి నాయకుడు కాని, విధానం గాని, దార్శనికత  కాని లేవని, కాంగ్రెస్ మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ మ్యానిఫెస్టోలా ఉందని యోగి ఆరోపించారు. 

ఎస్‌సి, ఎస్‌టిల రిజర్వేషన్లను ముస్లింలకు ధారాదత్తం చేయాలని కాంగ్రెస్ భావిస్తోందని కూడా ఆయన ఆరోపించారు. ఔరంగజేబు విధించిన జిజియా తరహాలో ఉందని, ఔరంగజేబు ఆత్మ కాంగ్రెస్‌లో చొరబడిందని యోగి విమర్శించారు. కాంగ్రెస్, ఇండియా కూటమికి ఎన్నికల్లో గెలవడం దేశాన్ని లూటీ చేయడానికి ఒక మార్గమని ఆయన ఆరోపించారు.

2014కి ముందు దేశంలో ప్రతి హిందూ పండుగ ముందు అల్లర్లు జరగడం సర్వసాధారణంగా ఉండేదని కూడా ఆయన గుర్తు చేశారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం 140 కోట్ల భారత ప్రజల మనోభావాలకు ప్రతిరూపమని ఆయన తెలిపారు. ప్రతిపక్ష కూటమి అధికారంలోకి రాకుండా శ్రీరాముడే చూసుకుంటాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.