
జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సిన అత్యవసర అంశాలపై మాత్రమే చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం షరతు విధించింది. అలాగే ఏజెండాలోని రైతు రుణమాఫీ, హైదరాబాద్ ఉమ్మడి రాజధానికి సంబంధించిన అంశాలను జూన్ 4వ తేదీ వరకు పక్కన పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగస్వామ్యం ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి హాజరుకావద్దని ఆదేశించింది.
రైతు రుణమాఫీ, ఏపీ-తెలంగాణ మధ్య విభజన అంశాలతో పాటు ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, ఇంకా రైతులకు సంబంధించిన అనేక అంశాలు, పాఠశాల విద్యాసంవత్సరం ప్రారంభానికి సన్నాహకాలపైన శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అలాగే మరోవైపు జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై కూడా సీఎం చర్చించాలని చూశారు.
అయితే సార్వత్రిక ఎన్నికల కోడ్, వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో మంత్రిమండలి సమావేశ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం ఈసీని కోరింది. ఈసీ నుంచి అనుమతి వస్తుందని భావించి శనివారం రాత్రి 7 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు సచివాలయంలోనే వేచి చూశారు.
కానీ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కేబినెట్ భేటీని వాయిదా వేశారు. సోమవారం వరకు ఈసీ స్పందించకపోతే ఢిల్లీకి వెళ్లి కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశానికి షరుతులతో కూడిన అనుమతిని ఇస్తూ నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేబినెట్ సమావేశం ఎప్పుడనేది రేపటిలోగా తెలిసే అవకాశముంది.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత