
దక్షిణ ఛత్తీస్ గఢ్ నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహే, లక్షద్వీప్, దక్షిణ కర్ణాటకలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లో మరో నాలుగు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మే 17 నుంచి 21 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మాహేలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
అదే సమయంలో మే 20,21 తేదీల్లో దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మే 20-21 తేదీల్లో కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల్లో తమిళనాడు, కేరళ, దక్షిణ కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు.
కాగా, పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇప్పటికే రాజస్థాన్ లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. పంజాబ్, హరియాణాలో కూడా ఉష్ణోగ్రత 44 డిగ్రీల సెల్సియస్ కు దగ్గరగా ఉందని, యూపీ సహా ఆయా రాష్ట్రాల్లో వడగాల్పులు వీస్తున్నాయని తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లలో మరో ఐదు రోజులు, మధ్యప్రదేశ్, బిహార్లలో నాలుగు రోజుల పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్