ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జిషీట్‌లో ఆప్ పేరు

ఢిల్లీ లిక్కర్ కేసు ఛార్జిషీట్‌లో ఆప్ పేరు
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఢిల్లీ లిక్కర్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. పార్టీ అగ్రనేతలు సైతం జైలుకు వెళ్లారు. ప్రస్తుతం ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించడంతో ఆయన ఆప్ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. 

ఈ క్రమంలనే ఈ కేసులో ఇప్పటికే ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన ఈడీ అధికారులు తాజాగా మరో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. అయితే ఇందులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా నిందితుల జాబితాలో ఈడీ చేర్చింది. దేశంలోనే మొట్టమొదటిసారి ఒక పార్టీని నిందితుడిగా చేయడం తీవ్ర సంచలనంగా మారింది.

ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ ఇప్పటికే 7 ఛార్జ్‌షీట్‌లు దాఖలు చేయగా ఇది ఎనిమిదవది. అయితే ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ అభియోగాలు మోపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఇప్పటివరకు 18 మందిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

ఇక కేజ్రీవాల్‌ను మార్చి 21 వ తేదీన ఈడీ అరెస్ట్ చేయగా 50 రోజుల తర్వాత ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్‌పై తీహార్ జైలు నుంచి బయటకి వచ్చారు. ఇక ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి, కింగ్‌పిన్‌ అరవింద్ కేజ్రీవాల్‌ అని ఈడీ ఇప్పటికే ఆరోపించింది.  ఢిల్లీలో కొత్త మద్యం పాలసీ రూపకల్పనలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించినట్లు ఈడీ తెలిపింది. 
 
ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో రకరకాల వ్యక్తుల నుంచి అందిన రూ.100 కోట్ల ముడుపులను  2022 గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఆమ్‌ ఆద్మీ పార్టీ వినియోగించిందని ఈడీ ఛార్జ్‌షీట్ ఫైల్ చేసింది.  ఈ క్రమంలోనే.. 2022 గోవా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్‌ ఉన్న ఓ 7 స్టార్ హోటల్‌ బిల్లులను కూడా ఈ కేసులో నిందితుడు చెల్లించినట్లు తమ వద్ద అన్ని సాక్ష్యాలు ఉన్నాయని ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్ ఎస్వీ రాజు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు.
మరోవైపు, తనను ఇడి అరెస్టు చేయడాన్ని, జ్యుడీషియల్‌ కస్టడీని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు రిజర్వ్‌ చేసింది. ఈ కేసులో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లచ్చని కేజ్రీవాల్‌కు సూచించింది.