కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు

కేజ్రీవాల్ పిఎ చెంపపై, కడుపులో కొట్టి, కాలుతో తన్నాడు
 
* పోలీసులకు ఆప్ ఎంపీ స్వాతి ఫిర్యాదు
 
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కలిసేందుకు ఆయన ఇంటికి సోమవారం వెళ్లిన్నప్పుడు తాను కేజ్రీవాల్ డ్రాయింగ్ గదిలో కూర్చొని ఉండగా ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై దౌర్జన్యపూర్వకంగా ప్రవర్తించిన ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతి మలివాల్ చివరకు మౌనం వీడారు. ముఖ్యమంత్రి నివాసంలో తనను చెంపపై, కడుపుపై కొట్టి, కాలుతో తన్నాడంటూ వెల్లడించారు. ఆ మేరకు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఢిల్లీ పోలీసులు  ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం.. బిభవ్‌ కుమార్‌ తనపై భౌతిక దాడికి పాల్పడినట్లు స్వాతి మలివాల్‌ పేర్కొన్నారు. సున్నితమైన శరీర భాగాలపై పలుమార్లు కొట్టాడని ఆరోపించారు. 7-8 సార్లు చెంపదెబ్బలు కొట్టి, కడుపుపై బలంగా కొట్టాడని, పొత్తికడుపుపై పదేపదే తన్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో తాను పీరియడ్స్‌లో ఉన్నట్లు వెల్లడించారు. కర్రతో పలు మార్లు బాదినట్లు తెలిపారు.
ఉదయం 9 గంటల సమయంలో కేజ్రీ నివాసంలోని డ్రాయింగ్‌ రూమ్‌లో వేచి ఉన్న సమయంలో సీఎం వ్యక్తిగత సహాయకుడు బిభవ్‌ కుమార్‌ ఆమెపై దాడి చేశాడు. ఆ సమయంలో కేజ్రీవాల్‌ కూడా ఇంట్లోనే ఉన్నట్లు మలివాల్‌ తెలిపారు. అయితే ఎఫ్‌ఐఆర్‌లో మాత్రం కేజ్రీవాల్‌ పేరును ఎక్కడా ప్రస్తావించలేదు.  కేసు నమోదు చేసిన తర్వాత స్వాతికి, ఎయిమ్స్​లో వైద్య పరీక్షలు చేశారు.
అంతకుముందు ఇద్దరు సభ్యుల డిల్లీ పోలీసు బృందం మాలీవాల్‌తో సమావేశమై ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుంది. ఆమె స్వగృహంలో జరిగిన ఈ భేటీ సుమారు నాలుగు గంటలకు పైగా జరిగింది.  దాడి ఘటనకు సంబంధించిన సమాచారం సేకరించేందుకు అదనపు పోలీసు కమిషనర్‌ పి.ఎస్‌.కుష్వాహా నేతృత్వంలోని బృందం మధ్యాహ్నం 1.50 గంటలకు స్వాతి మాలీవాల్‌ ఇంటికి వెళ్లిందని సంబంధిత వర్గాలు చెప్పాయి.

పోలీసులకు తన వాంగ్మూలాన్ని ఇచ్చినట్లు ఎంపీ స్వాతి మాలీవాల్‌ గురువారం వెల్లడించారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని బీజేపీకి విజ్ఞప్తి చేశారు. “నా విషయంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. దీనిపై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాను. వారు తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు. నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నవారు నేను మరో పార్టీ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. వారిని ఆ దేవుడే కాపాడాలి” అని ఎక్స్​లో మాలీవాల్‌ రాసుకొచ్చారు.

మాలీవాల్‌పై దాడి జరిగిందన్న ఘటనపై డిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తగిన చర్యలు తీసుకుంటారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆశాభావం వ్యక్తం చేశారు. రాయ్‌ బరేలీ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో గురువారం ఆమె ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ “కేజ్రీవాల్‌కు ఈ విషయం తెలుసు. ఆయన తగిన పరిష్కారం కనుగొంటారు” అని ప్రియాంక చెప్పారు.

కాగా, అరవింద్ కేజ్రీవాల్‌కు కట్టుబడి ఉండటమే బిభవ్ కుమార్ వృత్తి అని,  కేజ్రీవాల్ ఆదేశాల మేరకే  ఈ దుష్ప్రవర్తనకు పాల్పడ్డాడని బీజేపీ నాయకురాలు షాజియా ఇల్మీ ఆరోపించారు. “రాజకీయ లబ్ది కోసం వారు దీనిని సమర్థిస్తున్నారు… ఆమెను (స్వాతి మలివాల్) కొట్టారు… అరవింద్ కేజ్రీవాల్‌కు కట్టుబడి ఉండటమే బిభవ్ కుమార్ జాబ్ ప్రొఫైల్. ఆ వ్యక్తి దురుసుగా ప్రవర్తిస్తే నేను కూడా సహించాను. కొట్టడం అక్కడ చాలా సాధారణం” అంటూ ఆమె ధ్వజమెత్తారు.

“ప్రశాంత్ కుమార్, యోగేంద్ర యాదవ్‌లను కూడా బౌన్సర్లు నెట్టివేశారు. అయితే ఈసారి హద్దులు దాటారు… ఓ మహిళను మీ పీఏ కొట్టడం తగునా? పోలీసులు బాగా చేశారు. ఆమె సహాయం కోసం వారు చేరుకున్నారు. కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేయాలి.  ఓ మహిళా సహచారిణిని కొట్టిన తర్వాత కేజ్రీవాల్ సీఎంగా ఉండటం సబబు కాదు. ఆయన క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలి. వెంటనే ఆయనపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి” అని ఆమె డిమాండ్ చేశారు.