
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో చెలరేగిన అల్లర్లు, హింసాత్మక ఘటనలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి గురువారం వ్యక్తిగత వివరణ ఇచ్చారు. సుమారు అరగంట పాటు సీఎస్, డీజీపీ వివరణ ఇచ్చారు. ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
‘ఏపీలో ఏం జరుగుతోంది? స్వయంగా వచ్చి వివరణ ఇవ్వండి’ అని ఆదేశించడంతో… గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ గుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ విశ్వజీత్ ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధూ ముందు హాజరయ్యారు. ఈ భేటీలో జరిగిన చర్చ, తీసుకున్న నిర్ణయాలపై ఈసీ అధికారిక ప్రకటన జారీ చేసింది.
‘‘ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలు తగిన చర్యలు తీసుకునేలా చూడాలని సీఎస్, డీజీపీలకు ఘాటుగా, సూటిగా చెప్పాం’’ అని ఈసీ వెల్లడించింది.
కొన్ని వర్గాల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలు కారణంగానే హింస చెలరేగినట్లు జవహర్ రెడ్డి, హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. వీరివురితో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ కూడా వ్యక్తిగతంగా హాజరయ్యారు. అయితే హింసాత్మక ఘటనలను ఎందుకు అదుపుచేయలేక పోయారని సీఎస్, డీజీపీలను ఈసీ నిలదీసింది.
పోలీసు అధికారులను బదిలీ చేసిన చోట, మొదటి నుంచీ వ్యక్తిగత కక్షలు కార్పణ్యాలు ఉన్న చోట మాత్రమే హింసాత్మక ఘటనలు జరిగాయని, తాము అప్రమత్తంగానే ఉన్నామని సీఎస్, డీజీపీ ఇచ్చిన నివేదిక, పవర్ పాయింట్ ప్రజంటేషన్పైనా ఈసీ పలు సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించినట్లయితే తగిన జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు? అల్లర్లను ఎందుకు అదుపు చేయలేకపోయారు? ఈ సంఘటనలకు ఎవరు బాఽధ్యత వహించాలి? మీరా, మేమా? మీ వద్ద ఇంటెలిజెన్స్ సమాచారం ఉండదా?’’ అని వరుస ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది.
విచ్చలవిడిగా దాడులు జరుగుతుంటే ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం అందింది. వరుసగా మూడు రోజులపాటు జరిగిన హింసాత్మక ఘటనలకు ఎవరు బాధ్యులంటూ కేంద్ర ఎన్నికల సంఘం మండిపడిందని తెలుస్తోంది. పోలీసు అధికారుల నిర్లిప్తతపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మండిపడ్డారని సమాచారం.
మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో హింస చెలరేగడంపై ఎన్నికల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగులబెట్టడం లాంటి ఘటనలను ఎందుకు అదుపు చేయలేకపోయారని ఈసీ నిలదీసింది. పరిస్థితిని అదుపు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది.
దీనికి బాధ్యులు ఎవరంటూ మండిపడింది. హింసాత్మక ఘటనలు జరిగాక ఏం చర్యలు తీసుకున్నారో తమ ముందు హాజరైన వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలో జరిగిన పరిణామాలపై ఈసీకి వివరణ ఇచ్చారు. పల్నాడు, తాడిపత్రిల్లో దాడులు, చంద్రగిరిలో ఏకంగా టీడీపీ అభ్యర్థిపైనే దాడిచేయడం, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వరుసగా జరిగిన ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఆరా తీసిన ఈసీ అధికారులు ముందస్తుగా ఉన్న ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఏ విధంగా క్రోడీకరించుకున్నారని దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసినట్లు కూడా తమ దృష్టికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ముందుగానే హెచ్చరించినా చర్యలు తీసుకోవడంలో ఎందుకు విఫలమయ్యారని అభ్యర్థులపై దాడులు చేస్తుంటే ఎందుకు స్పందించలేదనే అంశాలపై వివరణ కోరినట్లు సమాచారం. ఒక పక్క హింసాత్మక ఘటనలు జరుగుతుంటే పోలీసు యంత్రాంగం చేష్టలుడిగి పోయినట్ల వ్యవహరించడమేమిటని ప్రశ్నించినట్టు సమాచారం.
పోలింగ్ రోజున పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించిన విషయాన్ని ఎన్నికల పరిశీలకులు ఈసీకి నివేదిక ఇవ్వడంతో వాటి గురించి కూడా ఇద్దరిని ప్రశ్నించారు. బందోబస్తు విషయంలో నిర్లక్ష్యం వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో జరిగిన ఘటనలు, తీసుకున్న చర్యలు, భవిష్యత్‌లో తీసుకోబోయే చర్యలను సీఎస్, డీజీపీలు నివేదిక రూపంలో అందజేశారు.
More Stories
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఘనవిజయం
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు