ఎమ్యెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు 

ఎమ్యెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు 

తెలుగుదేశం పార్టీలో చేరిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన శాసనమండలి సభ్యుడు జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు పడింది. ఆయనను అనర్హుడిగా ప్రకటించింది శాసన మండలి. ఈ మేరకు ఛైర్మన్ కొయ్యె మోషెన్ రాజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.  పార్టీ ఆవిర్భావం నుంచీ వైఎస్ఆర్సీపీలో పని చేస్తూ వచ్చిన వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జంగా కృష్ణమూర్తి.

ఆయన 1999, 2009 ఎన్నికల్లో గురజాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి గురజాల అసెంబ్లీ టికెట్‌ను ఆశించారు. 2014లో గురజాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయినప్పటికీ పార్టీకి చేసిన సేవలను గౌరవిస్తూ ఆయనను శాసనమండలికి నామినేట్ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.

ఈ ఎన్నికల్లో కూడా గురజాల నుంచి మళ్లీ అవకాశం ఇవ్వాలంటూ జంగా కృష్ణమూర్తి విశ్వ ప్రయత్నాలు చేశారు గానీ అది సాధ్యపడలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డిని కాదని ఆయనకు టికెట్ కేటాయించడానికి ఆసక్తి చూపలేదు వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది.
దీనితో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొద్దిరోజుల ముందు జంగా కృష్ణమూర్ వైఎస్ఆర్సీపీ నుండి నిష్క్రమించి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ విప్ లేళ్ల అప్పిరెడ్డి ఇదివరకే ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై తాజాగా శాసన మండలి ఛైర్మన్ కొయ్యె మోషెన్ రాజు స్పందించారు. జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు వేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.  శాసనమండలిలో జంగా కృష్ణమూర్తి విప్‌గా ఉన్నారు.. అయితే ఆయనను వైఎస్సార్‌సీపీని వీడకముందే ఆ పదవి నుంచి తొలగించారు. 
 
మ్మెల్సీగా అనర్హత వేటు కక్షపూరిత చర్య అని జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. మౌఖికంగా తన వివరణ తీసుకోకుండానే అనర్హత వేటు వేశారని దుయ్యబట్టారు. వెనుకబడిన వర్గాలపై తీసుకున్న చర్యగా భావిస్తున్నానని ఆరోపించారు. ఎమ్మెల్సీ పదవి తనకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదని, తన బీసీ వర్గాలకు ఇచ్చిందని పేర్కొన్నారు.
వైసీపీ నాయకులు మండలి చైర్మన్‌పై ఒత్తిడి తెచ్చి వేటు వేయించారని ధ్వజమెత్తారు. వంశీ, మద్దాలి గిరిలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం బీసీ నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. బీసీలను వాడుకొని వదిలేయడం వారికి అలవాటని పేర్కొన్నారు.