
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి రీ పోలింగ్ నిర్వహించాలని బిజెపి ఎంపి అభ్యర్థి మాధవీలత ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. ఈ స్థానంలో చివరి గంట వ్యవధిలో 12 శాతం పోలింగ్ నమోదై 48 శాతం పోలింగ్‌కి చేరుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని ఆమె పేర్కొన్నారు.
చివరి గంట సమయంలో అనూహ్యంగా పోలింగ్ పెరగడానికి కారణం మొత్తం నియోజకవర్గం పరిధిలో ఎంఐఎం భారీగా రిగ్గింగ్ చేసిందని బుధవారం ఆమె ఆరోపించారు. స్థానిక నేతలతో ఎంఐఎం నాయకులు ఇష్టానుసారంగా రిగ్గింగ్ చేయించారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి రీ పోలింగ్ చేయాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు.
రిగ్గింగ్ జరుగుతున్నట్లు తనకు సమాచారం వచ్చిందని అందుకే తాను వాటిని ఆపేందుకు పోలింగ్ స్టేషన్‌కు వెళ్లినట్లు ఆమె చెప్పారు. ఆ సమయంలో రిగ్గింగ్ ఆపేందుకు వెళ్లిన తనపై ఓ గుంపు దాడి చేసేందుకు ప్రయత్నించిందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అక్కడే పోలీసులు ఉన్నా వారు స్పందించలేదని ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే రీపోలింగ్ కోసం ఎంత దూరమైనా వెళ్తామని ఆమె తేల్చి చెప్పారు.
ఓ 16 ఏళ్ల బాలిక ఒకసారి ఓటు వేసిందని, ఆ తర్వాత మరోసారి ఓటు వేసేందుకు వచ్చి దొరికిపోయిందని మాధవీలత తెలిపారు. ఒక ఓటు పూర్తి కావడానికి ఈవీఎం కాస్త సమయం తీసుకుంటుందని, అలాంటిది పోలింగ్ రోజు చివరలో ఓటింగ్ శాతం ఒక్కసారిగా ఎలా పెరిగిందని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా ఎన్నికల రోజున మతతత్వాన్ని ఎవరు తీసుకువచ్చారని కొంపెల్లి మాధవీలత ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎంఐఎం నినాదాలు చేయడం ఎంత వరకు సమంజసం అని ఆమె నిలదీశారు. ఇది భారతదేశమేనా? ఇక్కడ 144 సెక్షన్ ఉండదా? అని ఆమె ప్రశ్నించారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత