పనిమనిషి దగ్గర దొరికిన డబ్బుతో ఝార్ఖండ్ మంత్రి అరెస్ట్

పనిమనిషి దగ్గర దొరికిన డబ్బుతో ఝార్ఖండ్ మంత్రి అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్ (70)ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్- ఈడీ బుధవారం అరెస్ట్ చేసింది. ఆలంగీర్ ఆలమ్ పీఏ సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి ఇంట్లో భారీ నగదు స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.  మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ) నిబంధనల ప్రకారం, ఈడీ జోనల్ కార్యాలయంలో రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో సుమారు ఆరు గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

గత వారం ఆలంగీర్ ఆలమ్ పీఏ సంజీవ్ కుమార్ లాల్ (52) పనిమనిషి జహంగీర్ ఆలమ్ ఇంట్లో 35 కోట్ల రూపాయలకు పైగా నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని, ఆ సొమ్ము అందుకు సంబంధించిందేనని ఆరోపించారు.

ఈ కేసులో ఆలమ్‌ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది. మంత్రి పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంటి సహాయకుడు జహంగీర్ ఆలమ్ నివాసంలో రూ.35 కోట్ల నగదును ఈడీ ఇటీవల స్వాధీనం చేసుకుంది. అనంతరం ఆ ఇద్దరినీ అరెస్టు చేసింది. 

గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణం కోసం వేసిన టెండర్‌‌కు అనుమతించినందుకు ప్రతిగా రూ.35 కోట్లు కమిషన్‌గా తీసుకున్నట్టు ఈడీ అనుమానిస్తోంది. లంచం సొమ్ముకు కేర్‌టేకర్‌గా తనను ఉంచారని, ఇందుకు గాను నెలకు రూ.15,000 చొప్పున వేతనం ఇస్తున్నారని జహంగీర్ ఆలమ్ ఈడీ ప్రాథమిక ఆచరణలో అంగీకరించినట్టు తెలుస్తోంది. 

సంజీవ్ కుమార్ లాల్ రాంచీలోని సర్ సైయద్ రెసిడెన్స్ అపార్ట్‌మెంట్స్‌లో అద్దెకు ఉంటూ డబ్బుల కట్టలున్న బ్యాగ్‌ను తరచు జహంగీర్‌కు ఇచ్చేవాడని, అక్కడి కప్ బోర్డులో అతను ఉంచేవాడని తెలుస్తోంది. అయితే, ఫ్లాట్‌లో దొరికిన సొమ్ము తనది కాదని సంజీవ్ లాల్ మొదట బుకాయించాడని, జహంగీర్ ఇచ్చిన సాక్ష్యంతో ఆయనను ఏజెన్సీ అరెస్టు చేసిందని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.

 ఈ క్రమంలో పట్టుబడిన సొమ్ముపై బుధవారం మధ్యాహ్నం 11 గంటలకు రాంచీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన అలంగీర్ ఆలమ్‌ను సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ ఆయన నుంచి సంతృప్తికరమైన సమధానం రాకపోవడంతో వెంటనే అదుపులోనికి తీసుకుంది.