హైదరాబాద్ లో బిజెపి ఓట్లు తొలగించారు

హైదరాబాద్ లో బిజెపి ఓట్లు తొలగించారు

హైదరాబాద్ నగరంలో బిజెపి అనుకూల ఓట్లను కొంతమేరకు తొలగించడంతో తమ అభ్యర్థులకు వచ్చే ఓట్లు కొంతమేరకు తగ్గవచ్చని కేంద్ర మంత్రి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు ఒక్కొక్క నియోజకవర్గాల్లో దాదాపు 20 వేల ఓట్లు అధికారులు తొలగించారని ఆరోపించారు. దీనిపై గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు.

అర్బన్ ప్రాంతాల్లో ఓటర్ల లిస్ట్ను సంస్కరించాల్సిన అవసరం ఉందని చెబుతూ  సికింద్రాబాద్, మల్కాజిగిరి, హైదరాబాద్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ లిస్ట్ను సంస్కరించాలని గతంలో పలుమార్లు జిల్లా ఎన్నికల అధికారులకు తెలియజేశామని చెప్పారు. ఓటర్లు పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లారని,  కొంతమంది వ్యక్తుల పేర్లు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని ఆయన తెలిపారు. 

ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరమని స్పష్టం చేస్తూ ఓటు నిర్ణయించడంలో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసేలా ఎన్నికల సంఘం ఆలోచిస్తే బాగుంటుందని సూచించారు. ఏదేమైనా, తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయం కమలం పార్టీనేనని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడుగడుగునా నిలదీస్తామని తెలిపారు.

 ఎన్నికల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై ఇష్టం వచ్చినట్లు సీఎం రేవంత్‌ మాట్లాడారని, ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలి ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయట్లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించట్లేదని చెప్పారు.  పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నారుని, ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. హామీలపై అడుగడుగునా కాంగ్రెస్‌ను నిలదీస్తామని హెచ్చరించారు.

ఎన్నికల సమయంలో ప్రధాని మోదీపై ఇష్టం వచ్చినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడారని, ఇప్పటికైనా అబద్ధాలు మానుకోవాలి సూచించారు.  “రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉంది. బీఆర్ఎస్ ఇచ్చిన పథకాల అమలుపై ప్రభుత్వం ప్రకటన చేయాలి. గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఆగిపోయాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఉన్నాయా? లేవా? అనేది ప్రజలకు చెప్పాలి” అని నిలదీశారు.