కేజ్రీవాల్​ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే!

కేజ్రీవాల్​ను సీఎంగా తొలగించే నిర్ణయం ఎల్జీదే!

మనీలాండరింగ్ కేసులో అరెస్టైన కారణంగా దిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్​ను తొలగించాలని దాఖలైన పిటిషన్​ను​ సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఈ విషయంపై చర్యలు తీసుకోవాల్సింది దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​ అని స్పష్టం చేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్​ సంజీవ్ ఖన్నా, దీపాంకర్​ తత్తాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అరెస్టు చేసిన తర్వాత ఆయన్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని కోరడం న్యాయబద్ధమైన విషయమని, కానీ దానికి చట్టపరమైన హక్కు లేదని స్పష్టం చేసింది. 

కాంతి భాటీ అనే వ్యక్తి ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది. దాంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. పదవిలో కొనసాగాలా? వద్దా? ఆయన వ్యక్తిగత విషయమని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఏదైనా తీవ్రమైన పరిస్థితులుంటే ఎల్‌జీ వీకే సక్సేనా చర్యలు తీసుకుంటారన్న కోర్టు.. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. పిటిషన్‌కు అర్హత లేదని పేర్కొంది.

మరోవైపు, సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే జూన్‌ 5నే తాను తీహార్ జైలు నుంచి విడుదలవుతానని అరవింద్ కేజ్రివాల్‌ తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చిన కేజ్రివాల్‌ పార్టీ కార్యాలయంలో ఆమ్ ఆద్మీ కౌన్సిలర్లతో సమావేశమయ్యారు.

జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నప్పుడు తనను అవమానపరిచే ప్రయత్నాలు జరిగాయని ఆయన చెప్పారు. తిహార్ జైలులోని తన గదిలో రెండు సీసీటీవీ కెమెరాలు అమర్చారని, ఆ దృశ్యాలను 13 మంది అధికారులు పర్యవేక్షించారని ఆరోపించారు. సీసీటీవీ దృశ్యాలను ప్రధాని కార్యాలయానికి అధికారులు అందజేసినట్లు కేజ్రీవాల్ ఆరోపించారు. 

 ఆప్ సర్కార్‌ పనిచూసి బీజేపీ భయపడుతోందని చెబుతూ  జూన్‌ 2న తిరిగి జైలుకు వెళతానన్న కేజ్రీవాల్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలను జైలు నుంచే చూస్తానని చెప్పారు. తనను అరెస్ట్ చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ మరింత సమైక్యంగా పనిచేస్తోందని ఆయన తెలిపారు.