మోదీ వారణాసిలో రేపే నామినేషన్.. ఘనంగా రోడ్ షో

మోదీ వారణాసిలో రేపే నామినేషన్.. ఘనంగా రోడ్ షో

ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో మే 14వ తేదీన నామినేషన్‌ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఈ ప్రక్రియను ఘనంగా నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

బీజేపీ సీనియర్‌ నేత సునీల్‌ బన్సల్‌ చాలా రోజుల నుంచి అక్కడే ఉండి పనులను చక్కబెడుతున్నారు. ఈ ప్రక్రియకు ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు అందరిని ఆహ్వానిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లను కూడా ఆహ్వానించారు. వారిద్దరూ కూడా పాల్గొంటున్నారు. నామినేషన్ అనంతరం ఎన్డీయే నేతలతో ప్రధాని ప్రత్యేకంగా భేటీ జరపనున్నారు.

నామినేషన్‌ ప్రక్రియ సందర్భంగా కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. బనారస్‌ హిందూ యూనివర్శిటీ నుంచి కాశీ విశ్వనాథుడి ఆలయం వరకు సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇది సుమారు నాలుగు గంటలపాటు ఉండనుందని తెలుస్తోంది.

గతంలో ప్రధాని మోదీ నామినేషన్‌ దాఖలు చేసిన వివరాల ప్రకారం, ఆయనకు ప్రస్తుతం 73 ఏళ్లు. 2024 ఎన్నికల ప్రచారంలో నిత్యం వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ సగటున మూడు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు మోదీ. నామినేషన్‌కు వెళ్లే ముందు ప్రధాని, సోమవారం పట్నాలో మూడు ర్యాలీలను పూర్తిచేసుకొని వారణాసి చేరుకుంటారని తెలుస్తోంది. 

అక్కడ మరికొన్ని ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం. ఎన్నికల ప్రచారం పూర్తి కానున్న మే చివరి నాటికి మోదీ మొత్తం 180 నుంచి 190 రోడ్‌షోలు, ర్యాలీలు, సభల్లో పాల్గొనున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ భారీ మెజార్టీతో గెలిచారు.  2014లో ఆప్‌ కన్వీనర్, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై 3 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ప్రధాని గెలుపొందారు. 2019లో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన షాలినీ యాదవ్‌పై 4 లక్షల 70 వేల పై చిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ప్రధానికి ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్ పోటీలో ఉన్నారు.

కాగా, ఈ పదేళ్లలో మంచి పాలనను అందించడం వల్లనే ఎన్నికల ముందు బీజేపీ ఎటువంటి జనాకర్షక విధానాలను ప్రకటించలేదని ప్రధాని మోదీ చెప్పారు. పదేళ్ల పాలనలో నిజమైన అభివృద్ధిని ఈ ప్రపంచానికి చూపించామని తెలిపారు. ఆదివారం ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అడ్డును రాజకీయంగా తొలగించుకోవడానికే ఇన్నాళ్లుగా విపక్షాలు ప్రయత్నిస్తూ వచ్చాయని ఆయన విమర్శించారు. 

పేదలను కేంద్రంగా చేసుకుని తాము నిర్వహించిన కార్యక్రమాల వల్ల గత పదేళ్లలో 25 కోట్లమంది దారిద్య్రరేఖ నుంచి బయటపడ్డారని వివరించారు. కేవలం ఐదేళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీచేయడం లేదని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలపడం లక్ష్యంగానే తలపడుతోందని తెలిపారు.

ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి గతంలో ఎన్నడూ రానంత తక్కువ సీట్లు వస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. ఆయన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వయస్సును గుర్తు చేస్తూ.. ‘‘రాహుల్‌కు యాభై ఏళ్లు దాటాయి. కానీ, కాంగ్రెస్‌ పార్టీకి అన్ని సీట్లు కూడా రావు’’ అని స్పష్టం చేశారు. అవినీతి అనేది ఇండియా కూటమిలోని ఉమ్మడి తత్వం అని, అదే ఆ పార్టీలను కలిపిందని మోదీ ఆరోపించారు.

 పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ప్రభుత్వం అవినీతిని పూర్తిస్థాయి బిజినె్‌సగా మార్చిందని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌ను ఆ పార్టీ ‘కుటీర బాంబుల పరిశ్రమ’గా మార్చివేసిందని మండిపడ్డారు. ‘‘ప్రతి ఇంటికి మంచి నీళ్లు అని మేం అంటుంటే.. ప్రతి ఇంటిలో బాంబు అని వాళ్లు మాట్లాడుతున్నారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ఆదివారం బెంగాల్‌లోని హౌరా, బారక్‌పూర్‌, హుగ్లీలో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు.