లోక్​సభ నాలుగో విడత 5 గంటల వరకు 62.31% ఓటింగ్​

లోక్​సభ నాలుగో విడత 5 గంటల వరకు 62.31% ఓటింగ్​
లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్ 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 96 నియోజకవర్గాల్లో చురుకుగా కొనసాగింది.  1717 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగా బారులు తీరిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
సోమవారం సాయంత్రం 5 గంటల వరకూ 62.31 శాతం పోలింగ్ నమోదైంది. ఈసీఐ విడుదల చేసిన వివరాల ప్రకారం, పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 75.66 శాతం పోలింగ్ నమోదుకాగా, జమ్మూకశ్మీర్‌లో అత్పల్పంగా 35.75 శాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో 68.04 శాతం పోలింగ్ నమోదు అయింది. 
 
కాగా, తెలంగాణలో 61.16 శాతం, బీహార్‌లో 54.14, జార్ఖాండ్‌లో 63.14, మధ్యప్రదేశ్‌లో 68.01, మహారాష్ట్రలో 52.49, ఒడిశాలో 62.96, ఉత్తరప్రదేశ్‌లో 56.35 శాతం పోలింగ్ నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాయంత్రం 5 గంటల వరకూ 67.99 శాతం, ఒడిశాలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 62.96 శాతం పోలింగ్ నమోదైంది.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినీలో ఆ రాష్ట్ర సీఎం మోహన్‌ యాదవ్‌ ఓటు వేశారు. ఇందౌర్‌లో ఓటు వేసేందుకు తెల్లవారుజాము నుంచే భారీ క్యూలు ఉండడం వల్ల ఓటర్లకు ఉచితంగా అల్పాహారం, ఐస్‌క్రీమ్‌లు అందించారు.  పశ్చిమబెంగాల్‌లో భారీగా పోలింగ్ నమోదైనప్పటికీ పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. 

బర్దమాన్-దుర్గాపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో తృణమూల్ కాగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకోగా, కల్నా గేట్‌లో బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈవీఎంలు పని చేయకపోవడం, ఏజెంట్ల అడ్డగింత వంటి ఫిర్యాదులు వెయ్యికి పైగా అందినట్లు అధికారులు తెలిపారు.

 నాలుగో విడతతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసింది. ఉత్తర్​ప్రదేశ్‌లో 13, మహారాష్ట్రలో 11, మధ్యప్రదేశ్, పశ్చిమ బంగాల్‌లో 8 చొప్పున, బిహార్​లో 5, ఒడిశా, ఝార్ఖండ్లో 4 చొప్పున, జమ్ముకశ్మీర్​లోని ఒక లోక్​సభ నియోజకవర్గంలో నాలుగో విడతలో భాగంగా పోలింగ్ జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో చెదురుముదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని, ఎక్కడా కూడా రీ పోలింగ్‌కు అవకాశం లేదని రాష్ట్ర ఎన్నికల అధికారి  ముఖేష్‌కుమార్‌ మీనా  వెల్లడించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుకున్నదానికంటే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చి ఓటును వినియోగించుకోవడం శుభపరిణామని తెలిపారు.

నాలుగో విడత పోలింగ్‌లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, అర్జున్ ముండా, లోక్​సభలో కాంగ్రెస్ పక్షనేతగా పనిచేసిన అధీర్ రంజన్ చౌధరీ, తృణమూల్ నేత మహువా మొయిత్రా తమ అదృష్టం పరీక్షించుకున్నారు. మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ తృణమూల్ తరపున కాంగ్రెస్‌ నేత అధిర్ రంజన్ చౌదరిపై పోటీ చేశారు. కేంద్ర మాజీ మంత్రి శత్రుఘ్న సిన్హా బంగాల్ లోని అసన్​సోల్ నుంచి తృణమూల్ తరపున పోటీ చేశారు. సమాజ్ వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కన్నౌజ్‌ నుంచి అదృష్టం పరీక్షించుకున్నారు.