
సుల్తాన్పూర్లో తన కోసం ప్రచారం చేయడానికి వరుణ్ ఆసక్తిని వ్యక్తం చేసినట్లు మేనకా గాంధీ చెప్పారు. అయితే ఆ విషయంపై నిర్ణయం పెండింగ్లో ఉందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వాన్ని విమర్శించేలా కొన్ని విషయాలపై వరుణ్ చేసిన ప్రసంగాల వల్లే టిక్కెట్ దక్కలేదా అని అడిగినప్పుడు తాను మరొక కారణం గురించి ఆలోచించలేనని చెప్పారు.
‘వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ నిరాకరించినందుకు ఒక తల్లిగా నాకు సంతోషమైతే కలగదు కదా. ఈసారి కూడా ఫీలీభీత్ నుంచి వరుణే పోటీ చేస్తే బాగుండేది. కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని మనం మార్చలేం’ అని మేనకాగాంధీ వ్యాఖ్యానించారు. ‘భవిష్యత్తులో వరుణ్ గాంధీ సుల్తాన్పూర్ స్థానానికి మారుతారా?” అని మేనకాగాంధీని ప్రశ్నించగా, అందుకు ప్రస్తుతానికి ఫీలీభీత్తో పాటు యావత్ భారతదేశం అతడి కర్మభూమి, ఆయన్ని అక్కడే పనిచేయనివ్వండి అని పేర్కొన్నారు.
సుల్తాన్పూర్ లోక్సభ స్థానంలో తాను జాతీయ అంశాల కంటే స్థానిక సమస్యల గురించే ఎక్కువగా మాట్లాడతానని, ఎందుకంటే ప్రజలకు వాటిపైనే ఆసక్తి ఎక్కువ అని తెలిపారు. గత ఎన్నికల్లో మీరు కేవలం 14వేల ఓట్ల తేడాతో గెలిచారు, ఈ సారి పరిస్థితి ఎలా ఉందని ప్రశ్నించగా, మరింత మెరుగైన విజయాన్ని సాధిస్తాని మేనకాగాంధీ చెప్పారు.
‘ఈ నియోజకవర్గంలో నేను స్థిరపడ్డాను. ఈసారి నేను మరింత మెరుగ్గా రాణిస్తాను. ఈ ప్రాంతానికి నా భర్త సంజయ్ గాంధీ ఎంతో సేవ చేశారు. దాన్ని ఇక్కడి ప్రజలు ఎప్పటికి మరిచిపోరు. నేను తప్పక గెలుస్తాను. ఈసారి ఎంత మెజారిటీ వస్తుందో ఇప్పుడే చెప్పలేను’ అని తెలిపారు.
వారసత్వ పన్ను అంశాన్ని శామ్ పిట్రోడా లేవనెత్తడాన్ని మేనకా గాంధీ తప్పుపట్టారు. వ్యక్తిగతంగా తాను వారసత్వపు పన్నుకు పూర్తిగా వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీజేపీ హయాంలో తాము ఎంతో మంది పేదలకు రేషన్ సరుకులు, పక్కా ఇళ్లను అందించగలిగామని చెప్పారు.
మూడు దశల లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి గురించి మీ అంచనా ఏమిటని మేనకాగాంధీని ప్రశ్నించగా, ‘మే 25న ఎన్నికలు జరగనున్న నా సీటుపై ఫోకస్ చేస్తున్నాను. మిగతా అంశాల గురించి ప్రస్తుతానికి నేను ఎలాంటి విశ్లేషణ చేయలేను’ అని తెలిపారు. ఎన్డీఏ కూటమికి 400కుపైగా లోక్సభ సీట్లుపై స్పందిస్తూ బీజేపీకి 370 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి పదవి గురించి ప్రశ్నించగా ‘నాకు దాని గురించి ఎలాంటి ఆలోచనలు లేవు. దానిపై నేను నిర్ణయాలు తీసుకోను. జంతు సంరక్షణ రంగంలో మరింత సేవ చేయాలనే ఉంది’ అని తెలిపారు. కాగా, సుల్తాన్పూర్ స్థానానికి మే 25న పోలింగ్ జరగనుంది. ఈసారి సుల్తాన్పూర్లో మేనకాగాంధీపై సమాజ్వాదీ పార్టీ నేత రామ్ భుల్ నిషాద్ పోటీ చేస్తున్నారు.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
అడ్డంకుల తొలగింపుకు చర్చలకు ట్రంప్, మోదీ సుముఖం!
ఇది ప్రతి భారతీయుడి విజయం