ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రభుత్వంపై తిరగబడిన ప్రజలపై కాల్పులు

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ప్రజలు ప్రభుత్వంపైకి తిరగబడ్డారు. పీఓకే ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీధుల వెంబడి భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. దీంతో పీఓకేలోని పోలీసులు ఏకే-47 తో కాల్పుల వర్షం కురిపించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో విసిగిపోయిన అక్కడి ప్రజలు ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారు. 
 
ఈ క్రమంలోనే భారీగా ర్యాలీలు, నిరసన ప్రదర్శనలతో కదం తొక్కారు. ఇక ఈ ఆందోళనలను అణిచివేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నిరసనకారులను అడ్డుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పీఓకే మొత్తం రణరంగంగా మారింది.  పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో భారీగా పెంచిన పన్నులు, అధిక ద్రవ్యోల్బణం, విద్యుత్ కొరత సహా అనేక సమస్యలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేస్తున్నారు. 
 
పీఓకే ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను పాకిస్థాన్‌లోని ఇతర పెద్ద నగరాలకు మళ్లించడంతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలోనే శనివారం భారీ మార్చ్ చేపట్టారు. ఈ క్రమంలోనే వారిని అణిచివేసేందుకు పాకిస్తాన్ రేంజర్లు, స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. టియర్ గ్యాస్, పెల్లెట్లు, గాల్లోకి బుల్లెట్లను ప్రయోగించారు. ఈ క్రమంలోనే పోలీసులు, పారామిలటరీ బలగాలు జరిపిన దాడిలో ఇద్దరు ప్రజలు చనిపోయారు.
 
అయితే ప్రభుత్వంపై నిరసన తెలుపుతూ ప్రజలు శాంతియుతంగానే నిరసన ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ఆందోళనలను అణిచివేసేందుకు ప్రభుత్వం హింసాత్మక మార్గాలను ఎంచుకుంది. మొదట గాల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు ఆ తర్వాత టియర్ గ్యాస్ సహా ఇతర మార్గాలను ఎంచుకున్నారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు పోలీసులపైకి తిరగబడటంతో తీవ్ర ఘర్షణ వాతావరణం చెలరేగింది. అది కాస్తా హింసాత్మక ఘటనలకు దారి తీసింది.
 
ఈ క్రమంలోనే పోలీసులు ఏకే-47 లతో గాల్లోకి, నిరసనకారులపైకి కాల్పులు జరిపిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఆందోళనల్లో విద్యార్థులు, మహిళలు కూడా పాల్గొన్నారు. ఇద్దరు పౌరులు చనిపోగా పదుల సంఖ్యలో జనం గాయాలపాలయ్యారు. వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రుల్లో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.