ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‍పై నిషేధం

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్‍పై నిషేధం

ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్  పడి లేచిన కెరటంలా పుంజుకుంది. తొలి తొలి ఐదు మ్యాచ్‍ల్లో ఒక్కటి మాత్రమే గెలిచిన ఢిల్లీ ఆ తర్వాత ఏడు మ్యాచ్‍ల్లో ఏకంగా ఐదు విజయాలు సాధించింది. దీంతో ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ఇప్పటి వరకు 12 మ్యాచ్‍ల్లో ఆరు గెలిచింది రిషబ్ పంత్ సారథ్యలోని ఢిల్లీ క్యాపిటల్స్. ప్లేఆఫ్స్ చేరాలంటే లీగ్ దశలో మిగిలిన తన రెండు మ్యాచ్‍లను ఢిల్లీ గెలవడం తప్పనిసరిగా మారింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మే 12న, లక్నో సూపర్ జెయింట్స్‌తో మే 14న ఢిల్లీ తలపడాల్సి ఉంది.  అయితే, ఇలాంటి కీలక సమయంలో ఆ జట్టుకు షాక్ ఎదురైంది. ఢిల్లీ క్యాపిటల్స్  కెప్టెన్ రిషబ్ పంత్‍పై ఓ మ్యాచ్ నిషేధం పడింది.  స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్‍పై ఓ మ్యాచ్ నిషేధాన్ని బీసీసీఐ విధించింది. రూ.30 లక్షలు జరిమానా కూడా విధించింది. 

రాజస్థాన్ రాయల్స్‌తో మే 7న జరిగిన మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ సీజన్‍లో ఆ జట్టు మూడోసారి స్లోఓవర్ రేట్ తప్పిదం చేసింది. దీంతో కెప్టెన్ రిషబ్ పంత్‍పై ఓ మ్యాచ్ నిషేదం విధించింది బీసీసీఐ. నిషేధం వేటు పడటంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరగనున్న కీలక మ్యాచ్‍కు రిషిబ్ పంత్ దూరం కానున్నాడు.

 ప్లేఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన పోరుకు కెప్టెన్ పంత్ దూరమవడం ఢిల్లీకి పెద్ద ఎదురుదెబ్బగా ఉంది. పంత్ లేకపోవటంతో ఆర్సీబీతో మ్యాచ్‍లో ఢిల్లీ జట్టుకు ఎవరు కెప్టెన్సీ చేస్తారనేది కూడా ఉత్కంఠగా మారింది. ఓ మ్యాచ్ నిషేధంతో పాటు రూ.30లక్షల ఫైన్ కూడా రిషబ్ పంత్‍కు విధించినట్టు బీసీసీఐ వెల్లడించింది. 

“ఢిల్లీలో మే 7వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2024 సీజన్ 56వ మ్యాచ్‍లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసి ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించిన ఢిల్లీ కాపిటల్  కెప్టెన్ రిషబ్ పంత్‍ను ఓ మ్యాచ్ నిషేధించటంతో పాటు ఫైన్ విధిస్తున్నాం” అని బీసీసీఐ శనివారం వెల్లడించింది.