
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ బాబాకు దేశాన్ని అప్పగిస్తే అధోగతి పాలు చేస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు. శనివారం వనపర్తిలో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు రేవంత్ రెడ్డి జూటాకోర్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అపహాస్యం చేశాడని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాటు అధికారంలో ఉండి రూ. 12 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నీతివంత పాలన సాగిస్తూ అవినీతి లేని నాయకుడిగా దేశం, ప్రపంచం గౌరవిస్తోందని తెలిపారు. అయోధ్యలో 500 ఏళ్లుగా రామ మందిరం నిర్మాణానికి నోచుకోక హిందువులు మానసిక వేదన చెందితే నరేంద్ర మోదీ ఉక్కు సంకల్పంతో దేశంలో ఎక్కడ అల్లర్లు జరగకుండా అందరినీ ఒప్పించి రామ మందిర నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు.
మందిరం ప్రారంభానికి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రారంభానికి రాకుండా హిందూ ధర్మం కలిగిన కాంగ్రెస్ నాయకులకు అడ్డు పడిందని హోంమంత్రి ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో రాహుల్ బాబా కాంగ్రెస్ పార్టీకి కాకుండా ఓవైసీ కోసం పరితపిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు రైతు పెట్టుబడి కింద ఏడాదికి రూ. 15,000 రైతుల ఖాతాలో జమ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పారని, ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్, నిరుద్యోగ యువతకు వారి ఖాతాలో ఐదు లక్షలు జమ చేస్తామని, విద్యార్థినీలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఏవీ ఇవ్వలేదని విమర్శించారు.
ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పి నేటికీ అతీ గతీ లేదన్నారు. రైతులకు డిసెంబర్ 9న రూ. 2లక్షల రుణమాఫీ చేస్తానని మొండిచేయి చూపారని చెప్పారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ అవమానం చేయగా, నరేంద్ర మోదీ సారథ్యంలో అంబేద్కర్ జన్మదినాన్ని గుడ్ గవర్నెన్స్ గా ప్రకటించినట్లు ఆయన తెలిపారు.
26 జనవరి రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ గా అంబేద్కర్ జన్మస్థలాన్ని అభివృద్ధి చేయడంతో పాటు లండన్ లో ఆయన చదువుకున్న కళాశాలను అభివృద్ధి పరిచేందుకు భారత ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, నాగపూర్ లో ఆయన పెరిగిన స్థలాన్ని కూడా జీవ భూమిగా నిర్మాణం చేసి 5 పంచ్ కేంద్రాలుగా తీర్థ స్థలాలుగా తీర్చిదిద్దిన ఘనత నరేంద్ర మోదీకి దక్కిందని వివరించారు.
నాగర్ కర్నూల్ కు అనేక అభివృద్ధి నిధులు ఇచ్చామని పేర్కొంటూ కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ మీదుగా నంద్యాల వరకు జాతీయ రహదారి విస్తరణకు రూ. 820 కోట్లు మంజూరు చేయడంతో పాటు సోమశిల వద్ద కృష్ణా నదిపై ఐకాన్ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 1100 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. అచ్చంపేటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూపకల్పన చేశామని చెప్పారు.
దేశానికి శాంతితోపాటు గౌరవ మర్యాదలు మరింత పెరగాలంటే నాగర్ కర్నూల్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ కు ప్రతి ఒక్కరూ ఓట్లు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని అమిత్ షా కోరారు. కొంచం ఉష్ణోగ్రతలు ఎక్కువైనా విదేశాలకు వెళ్లే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తమకు పోటీనే కాదని వికారాబాద్ లో జరిగిన బహిరంగసభలో అమిత్ షా ఎద్దేవా చేశారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు