మోదీకి 75 ఏళ్లు వచ్చినా ప్రధానిగా కొనసాగుతారు

మోదీకి 75 ఏళ్లు వచ్చినా ప్రధానిగా కొనసాగుతారు

నరేంద్ర మోదీ మళ్లీ దేశానికి ప్రధానమంత్రి అవుతారని, వచ్చే ఏడాది ఆయనకు 75 ఏళ్ళు నిండినా ఆయనే పూర్తికాలం ప్రధానిగా కొనసాగుతారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయని, అప్పుడు ఆయన పదవీ విరమణ చేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వాఖ్యలపై స్పందించారు. 

పైగా, మోదీ తిరిగి ప్రధాని కాగానే ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను సీఎం పదవి నుంచి దించుతారని, అమిత్‌ షాను ప్రధానిని చేస్తారని కేజ్రీవాల్ చేసిన వాఖ్యాలను కొట్టిపారవేసారు.  హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు.
 
75 ఏళ్ల వయస్సులో నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండరనేది అవాస్తవమని, ఆయనే ప్రధానమంత్రిగా ఉంటారని తెలిపారు. మూడు విడతల్లో ఎన్డీయే 200పైగా సీట్లు సాధిస్తుందని, మూడో విడతల్లో కంటే నాల్గో విడతలోనే బీజేపీకి మరిన్ని సీట్లు వస్తాయని, ఇతర పార్టీలోత పోలిస్తే కమలం ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు.
 
‘మోదీజీకి 75 ఏళ్లు నిండినందుకు సంతోషించాల్సిన అవసరం లేదని అరవింద్ కేజ్రీవాల్‌కు, ఇండియా బ్లాక్‌కు నేను చెప్పాలనుకుంటున్నా. మోదీజీ ప్రధాని కాలేరని బీజేపీ రాజ్యాంగంలో లేదు. మళ్లీ ఆయనే ప్రధాని అవుతారు. పదవీ కాలాన్ని పూర్తి చేస్తారు’ అని తేల్చి చెప్పారు.
 
కాగా, తెలంగాణలో బీజేపీకి మంచి స్పందన ఉందని చెబుతూ రాష్ట్రంలో బిజెపి 10 సీట్లు గెలుస్తుందని భరోసా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అవీనితి పార్టీ కాంగ్రెస్​ ఒకవైపు, బీజేపీ ఒకవైపు ఉందని వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో బీఆర్​ఎస్​ అవినీతిపై కాంగ్రెస్​ ఇప్పటికీ చర్యలు చేపట్టలేదని విమర్శించారు.
 
తెలంగాణ ప్రభుత్వ స్టీరింగ్ ఇప్పటికీ ఓవైసీ చేతిలోనే ఉందని  అమిత్​షా విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు కాంగ్రెస్​ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. తన వీడియోను ఎడిట్‌ చేసి తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే మళ్లీ ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తారని, ట్రిపుల్ తలాక్‌ను కూడా తీసుకొస్తారని ఆరోపించారు