రఫాపై ఇజ్రాయిల్‌ దాడులు మరింత ముమ్మరం

రఫాపై ఇజ్రాయిల్‌ దాడులు మరింత ముమ్మరం
అంతర్జాతీయ సమాజం అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ దక్షిణ గాజా నగరమైన రఫాపై ఇజ్రాయిల్‌ దాడులను మరింత ముమ్మరం చేసింది. నివాస ప్రాంతాలను, ప్రభుత్వ భవనాలను లక్ష్యంగా చేసుకుని బాంబులు, ఫిరంగులు, డ్రోన్లతో దాడి చేస్తుంది. ఇప్పటికే లక్ష మందికి పైగా ప్రజలు రఫా నగరాన్ని వీడి ఇతర ప్రాంతాలకు పారిపోయారు. 
 
ఈ వారం ఆరంభంలో రఫాపై దాడికి దిగిన ఇజ్రాయిల్‌ సైన్యం మొదట హమాస్‌ స్థావరాలకే వీటిని పరిమితం చేస్తామని చెప్పింది. దానికి భిన్నంగా ఇప్పుడు సరిహద్దు మార్గాలను పూర్తిగా మూసివేసి, రఫా తూర్పు ప్రాంతాన్ని యుద్ధ ట్యాంకులతో ముట్టడించి గత రెండు రోజులుగా ఇజ్రాయిల్‌ దాడుల్లో 109 మంది చనిపోయారు. ఉత్తర గాజా నుంచి హమాస్‌ ఇజ్రాయిల్‌ దళాలపై గురువారం రాకెట్లతో దాడిచేసినట్లు ఎఎఫ్‌పి వార్తా సంస్థ తెలిపింది. 
 
రఫా నుంచి ఇజ్రాయిల్‌ బలవంతంగా తరిమేసిన లక్షా పదివేల మంది శరణార్థులు సెంట్రల్‌ గాజాలోని దీర్‌ అల్లాలామ్‌కు చేరుకున్నారు. ఈజిప్టుకి, గాజాకు మధ్య సరిహద్దు మార్గమైన రఫా బోర్డర్‌ క్రాసింగ్‌, ఇజ్రాయిల్‌కి, గాజాకు మధ్య వున్న కరెమ్‌ అబూ సలేం క్రాసింగ్‌ను ఇజ్రాయిల్‌ సైన్యం పూర్తిగా దిగ్బంధించింది. దీంతో ఆహారం, ఇంధనం, మందులను తీసుకుని వస్తున్న 400 ట్రక్కులు సరిహద్దుకు ఆవల ఈజిప్టువైపు నిలిచిపోయాయి.
 
 గాజాలో ప్రజల ఆకలి తీర్చేందుకు రోజుకు కనీసం 500 ట్రక్కుల ఆహారం, మందులు అవసరమవుతాయని ఐరాస సహాయక సంస్థ తెలిపింది. ఇజ్రాయిల్‌ చర్య మూలంగా రఫాలోని 15 లక్షల మంది ఆకలి రక్కసి కోరల్లో చిక్కుకునే ప్రమాదం ముంచుకొస్తోంది.  ప్రస్తుతానికి రఫాలో మూడు రోజులకు సరిపడా ఇంధనం, ఆహార నిల్వలు మాత్రమే మిగిలి ఉన్నాయని ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యు ఎఫ్‌పి) తెలిపింది. 
 
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అది పెను మానవ విపత్తుకు దారి తీస్తుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. మందుల సరఫరా ఆగిపోవడం వల్ల ఆసుపత్రులు మూత పడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ ) హెచ్చరించింది. పౌరుల నివాస ప్రాంతాల జోలికి వెళితే ఇజ్రాయిల్‌కు ఆయుధ సరఫరా నిలిపేస్తామని బైడెన్‌ ప్రభుత్వం చేసిన ప్రకటన మాటలకే పరిమితమైంది. 
 
అమెరికా గీసిన గీతను నెతన్యాహు తాజా చర్య ద్వారా బాహాటంగా అతిక్రమించారు. ఇదిలా వుండగా పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించే అంశంపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ అత్యవసర సమావేశం గురువారం తిరిగి ప్రారంభమైంది. 194 వ దేశంగా పాలస్తీనాను గుర్తించాలని భద్రతా మండలిని కోరుతూ అరబ్‌ గ్రూపు దేశాలు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి.