ఐరాసలో పాలస్తీనాకు అనుకూలంగా ఓటేసిన భారత్

ఐరాసలో సభ్యత్వం కోసం పాలస్తీనా చేసిన ప్రయత్నానికి ఐక్యరాజ్యసమితి శుక్రవారం మద్దతు తెలిపింది. భారతదేశంతో సహా 143 దేశాలు పాలస్తీనాకు ఐరాసలో సభ్యత్వం కల్పించాలన్న ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశాయి. అమెరికా, ఇజ్రాయెల్ సహా తొమ్మిది దేశాలు తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయగా, మరో 25 దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు. 

ఐరాసలో ఈ తీర్మానాన్ని యూఏఈ ప్రవేశపెట్టింది. ఇదే ప్రతిపాదనను గత నెలలో అమెరికా వీటో చేసింది. ఆ తరువాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ విషయాన్ని “సానుకూలంగా పునఃపరిశీలించాలని” ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పిలుపునివ్వడంతో ఈ ఓటింగ్ జరిగింది.

‘నేను ఇంతకు ముందు వందల సార్లు ఈ పోడియం వద్ద నిలబడ్డాను, కానీ ఇంత ముఖ్యమైన ఓటు కోసం ఎన్నడూ నిలబడలేదు. ఇది చారిత్రాత్మకమైనది’ అని ఐరాసలో పాలస్తీనా రాయబారి రియాద్ మన్సూర్ భావోద్వేగంతో నిండిన స్వరంతో ఓటింగ్ కు ముందు వ్యాఖ్యానించారు. స్వేచ్ఛాయుత దేశాల కూటమిలో పాలస్తీనాకు సముచిత స్థానం లభించే రోజు రాబోతోందని హర్షం వ్యక్తం చేశారు.

పాలస్తీనాకు అనుకూలంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయం తీసుకోవడంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐక్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్ ప్రతినిధి గిలాడ్ ఎర్డాన్ ఈ తీర్మానం తనను బాధ పెట్టిందని తెలిపారు. ఈ కొత్త తీర్మానం వల్ల ఐసిస్ లేదా బోకో హరామ్ ప్రతినిధులు మన మధ్య కూర్చుంటారని ఎర్డాన్ వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వాలకు కల్పించాల్సిన హక్కులను పాక్షికంగా ఉగ్రవాదుల నియంత్రణలో ఉన్న సంస్థకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఇకపై ఈ సభలో పిల్లలను చంపే హమాస్ రేపిస్టులు కూర్చుంటారని విమర్శించారు. ఐక్యరాజ్యసమితిలో అమెరికా డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు.

గాజాలో యుద్ధం తీవ్రతరం కావడంతో పాలస్తీనాకు ఐక్యరాజ్యసమితిలో పూర్తి స్థాయిలో సభ్యత్వం కల్పించే ప్రతిపాదనను ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో మరోసారి తెరపైకి తీసుకువచ్చారు. గతంలో 2011 లో ఈ తరహా ప్రతిపాదన ఐరాసాలో చర్చకు వచ్చింది. ఐరాసలో ప్రస్తుతం పాలస్తీనా “పరిశీలక హోదాలో సభ్యేతర దేశం”గా ఉంది.

 పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందానికి వెలుపల పాలస్తీనాను దేశంగా గుర్తించడాన్ని అమెరికా వ్యతిరేకిస్తుంది. గత డిసెంబర్ లో గాజా  యుద్ధంలో తక్షణ కాల్పుల విరమణ తీర్మానానికి ఐరాసలోని 193 దేశాల్లో 153 దేశాలు మద్దతు తెలిపాయి. అమెరికా సహా 10 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా, 23 దేశాలు ఓటింగ్ లో పాల్గొనలేదు.