పోలింగ్ ముందు నగదు బదిలీకి జగన్ కు ఈసీ మోకాలడ్డు

పోలింగ్ ముందు  నగదు బదిలీకి జగన్ కు ఈసీ మోకాలడ్డు
 
* హైకోర్టు స్టే పొందినా పట్టు వదలని ఎన్నికల కమిషన్
ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారులకు పోలింగ్ కు రెండు రోజుల ముందు నగదు బదిలీ చేయడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రయత్నానికి ఎన్నికల కమిషన్ అడ్డుగా నిలిచింది. ఈ విషయమై ఎన్నికల కమిషన్ నిర్ణయంపై ఒక రోజు స్టే పొందటం ద్వారా శుక్రవారం హడావుడిగా సుమారు రూ 10,000 కోట్లు నగదు బదిలీ చేయాలనీ చేసేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. 

గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు మే నెలలో నగదు బదిలీ ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ నిలదీసింది.  పోలింగ్ పూర్తయ్యే వరకు నగదు బదిలీ చేపట్టవద్దని స్పష్టం చేసింది. దానితో పోలింగ్ సమయంలో రూ 14,000 కోట్లకు పైగా నగదు బదిలీ చేసే ప్రయోజనం పొందాలనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోన్ రెడ్డి ఎత్తుగడకు గండి పడినట్లయింది. 

ఏపీలో మునుపెన్నడూ మే నెలలో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేసిన చరిత్ర లేదని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి, ప్రభుత్వ ఎత్తుగడను ఎండగట్టింది. ఏపీ ఖజానాలో సరిపడా నిధులు ఉన్నా జనవరి నుంచి మార్చి వరకు లబ్దిదారులకు నిధులు విడుదల చేయలేదని ఈసీ అభిప్రాయపడింది.  

సంక్షేమ పథకాలకు నిధుల విడుదలపై గురువారం హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో శుక్రవారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.  రూ 10,000 కోట్ల మేరకు నగదు బదిలీకి సిద్ధమైన ఆర్థిక శాఖ అధికారులు చివరి నిముషంలో వెనుకడుగు వేసిన్నట్లు తెలుస్తున్నది. వోట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఆమోదం పొంది ఉండడంతో, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో  ఇంతగా భారీగా నిధులను విడుదల చేస్తే తర్వాత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని భయపడినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

శుక్రవారం ఉదయం హైకోర్టు తీర్పు నేపథ్యంలో నగదు బదిలీ పథకాలకు నిధుల విడుదలపై ఈసీ అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. దీనిపై స్పందించిన  ఎన్నికల సంఘం పలు అంశాలపై వివరణ కోరుతూ మధ్యాహ్నం 3 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం డిబిటి పథకాలను నిధులను విడుదల చేసిన తేదీలు, అవి లబ్ధిదారుల ఖాతాలకు జమైన తేదీలను అందించాలని ఈసీ కోరడంతో ఆ వివరాలను ఎన్నికల సంఘానికి ప్రభుత్వం సమర్పించింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలను పరిశీలించిన ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఖజానా పరిస్థితి 2024 జనవరి – మార్చి మధ్య కాలంలో నగదు బదిలీ పథకాలకు చెల్లింపులకు అనుకూలంగానే ఉందని గుర్తించారు. వివిధ పథకాలకు నగదును చెల్లించే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నా, వాస్తవ వ్యవధి కంటే ఎక్కువ కాలం పాటు సాగదీసినట్టు ఈసీ అ‎భిప్రాయపడింది. నిధులు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్దిదారులకు బదిలీ చేయడంలో జాప్యం జరిగినట్టు ఈసీ అభిప్రాయపడింది.

మరోవైపు గతంలో డిబిటి పథకాలకు నిధులు విడుదల చేసిన తేదీలను పరిశీలిస్తే 2024 మే నెలలో సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉన్నట్టు కనిపించడం లేదని అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాల ఆధారంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీకి ముందు మే 10వ తేదీలోపు నిధులు విడుదల చేయాల్సిన అవసరం లేదని ఈసీ స్పష్టం చేసింది.

మే 9వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లోనే మే13వ తేదీ తర్వాత లబ్దిదారులకు నగదు బదిలీ విషయంలో ఈసీ ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తదని స్పష్టం చేసినట్టు గుర్తు చేశారు. ఈసీ మే 3,9 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులను 10వ తేదీ వరకు అబయన్స్‌లో పెడుతూ సింగల్ జడ్జి తీర్పునిచ్చారు. దీనిపై ఎన్నికల సంఘం డివిజన్‌ బెంచ్‌లో హైకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేసిందని గుర్తు చేశారు. 

హైకోర్టు డివిజన్ బెంచ్‌ ఈసీ విజ్ఞప్తిని నమోదు చేసిందని, మే 13వ తేదీ తర్వాత నిధుల విడుదల విషయంలో ఈసీఐ ఎలాంటి అభ్యంతరాలు చెపక్పదని ఎన్నికల సంఘం జాయింట్ సెక్రటరీ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మరోవైపు ఏపీలో లబ్దిదారులకు నిధుల విడుదల చేయాలని హైకోర్టు సింగల్ బెంచ్ జారీ చేసిన ఉత్తర్వులపై నవతరం పార్టీ తరపున ఏపీ హైకోర్టులో డివిజన్‌ బెంచ్‌లో పిటిషన్‌ దాఖలైంది. 

దీనిపై  చీఫ్‌ జస్టిస్ బెంచ్ విచారణ జరిపింది. నగదు బదిలీ పథకాలపై సింగిల్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‍పై విచారణలో ఎన్నికల సమయంలో నిధుల విడుదల నిబంధనలకు విరుద్దమని  పిటిషనర్ న్యాయవాది వాదించారు.  ఎన్నికల సమయంలో నిధులు విడుదల  చేయడం ఓటర్లను ప్రలోభ పెట్టడమేనని వాదించారు. 

సింగల్ బెంచ్‌ ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్నికల సంఘం తీరును హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు కన్నా ఎక్కువ అని ఈసీ భావిస్తున్నట్టుందని,  ఎన్నికల నిర్వహణలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రమాణాలు ఎందుకని ప్రశ్నించారు.  నిధుల విడుదలకు హైకోర్టు ఆదేశాలిచ్చిన తర్వాత ఈసీ ఏ అధికారంతో ప్రభుత్వాన్ని వివరణ కోరిందని న్యాయమూర్తి ప్రశ్నించారు. 

రిట్ అప్పీల్ చేయకుండా హైకోర్టు ఆదేశాలను ఈసీ ఏ విధంగా పక్కన పెట్టిందని ప్రశ్నించారు.  కోర్టు విచారణ సమయం ముగిసిపోవడంతో  డిబిటి పథకాలపై డివిజన్ బెంచ్‍లో అప్పీల్‍పై విచారణను వేసవి సెలవుల అనంతరం వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై  ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొన్నారు.  సింగిల్ జడ్జి ఉత్తర్వులకు ఇచ్చిన సమయం అయిపోయిందని, సింగిల్ జడ్జి ఉత్తర్వుల ప్రకారం ఈనెల 11, 12, 13 తేదీల్లో నిధుల విడుదల చేయవద్దని ఆదేశాలున్నాయని గుర్తు చేశారు.