లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లైనా రావు

2024 లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 50 సీట్లైనా గెలవదని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. ఎన్నికల తర్వాత హస్తం పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోతుందని ఎద్దేవా చేశారు.  ఒడిశాలోని ఫుల్బానీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్, బీజేడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
 26 ఏళ్ల క్రితం రాజస్థాన్​లో ఇదే రోజున (మే 11) వాజ్ పేయీ ప్రభుత్వం నిర్వహించిన పోఖ్రాన్ అణుపరీక్షలు ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠను మరింత పెంచాయని గుర్తు చేశారు. 
అయోధ్యలో రామ మందిరం నిర్మించడం ద్వారా దేశ ప్రజల 500 ఏళ్ల నిరీక్షణకు బీజేపీ తెరదించిదని పేర్కొన్నారు. ఒడిశాలో తొలిసారి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడబోతుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఒడియా భాష, సంస్కృతిని అర్థం చేసుకున్న వ్యక్తి ఒడిశాలో ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వంలో సీఎం అవుతారని చెప్పారు.
 
“లోక్​సభ ఎన్నికల్లో ఎన్​డీఏ 400 సీట్లు దాటుతుందని దేశ ప్రజల మనసులో ఉంది. జూన్ 4న ఎన్​డీఏ గెలుపును దేశ ప్రజలు ఇప్పుడే నిర్ణయించారన్న విషయం కాంగ్రెస్ గమనించాలి. కాంగ్రెస్ ఎప్పుడూ భారత ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తోంది” అంటూ విమర్శించారు. 
“పాకిస్థాన్‌ వద్ద అణుబాంబులు ఉన్నాయని (మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ) మనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది. కాంగ్రెస్ పార్టీది ఎప్పుడూ ఇదే వైఖరి. హస్తం పార్టీ వైఖరి కారణంగా జమ్ముకశ్మీర్ ప్రజలు 60 ఏళ్లు ఉగ్రవాదాన్ని ఎదుర్కొన్నారు. దేశంలో అనేక ఉగ్రదాడులు జరిగాయి. హస్తం పార్టీ ఉగ్రవాదులతో సమావేశాలు జరిపిన విషయాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదు” అంటూ ప్రధాని ధ్వజమెత్తారు. 

‘‘కాంగ్రెస్ పార్టీ మళ్లీ పదే పదే తన సొంత దేశాన్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయి కాబట్టి, ఆ దేశాన్ని గౌరవించాలని వాళ్లు చెప్తున్నారు. చచ్చిన శవంలా మారిన ఈ వ్యక్తులు భారతదేశ ఆత్మను సైతం చంపుతున్నారు. పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండొచ్చు కానీ, వాటిని ఎలా ఉంచుకోవాలో వారికి తెలియడం లేదు. తమ బాంబులను విక్రయించేందుకు వాళ్లు కొనుగోలుదారుల కోసం వెతుకుతున్నారు. కానీ.. ఆ బాంబుల నాణ్యత గురించి ప్రజలకు తెలుసు కాబట్టి, వాటిని కొనేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు’’ అని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.

“26/11 దాడి తర్వాత నిందితులపై దర్యాప్తు జరిపేందుకు కాంగ్రెస్ సాహసించలేదు. ఎందుకంటే తమ ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందని హస్తం పార్టీ భయపడింది.” అని ప్రధాని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో దేశం అనేక ఉగ్రదాడుల్ని చూసిందని.. ఉగ్రవాద సంస్థలతో వాళ్లు సమావేశాలు నిర్వహించడాన్ని మన దేశం ఎప్పటికీ మర్చిపోదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కంధమాల్​లోని ఫుల్బానీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పద్మశ్రీ అవార్డు గ్రహీత పూర్ణమాసి జానీని సత్కరించారు ప్రధాని మోదీ. అనంతరం ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.