రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ

రాయ్‌బరేలీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రాహుల్‌ గాంధీ
కాంగ్రెస్‌ కంచుకోటలుగా భావించే ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆ రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది తేలిపోయింది. రాయ్‌బరేలి నుంచి పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ బరిలోకి దిగుతున్నట్లు ఏఐసీసీ ప్రకటించింది.  అదేవిధంగా అమేధీ నుంచి గాంధీ కుటుంబ విధేయుడు కిశోరీ లాల్‌ శర్మను రంగంలోకి దించింది.
ఈమేరకు కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌ వేదికగా జాబితాను విడుదల చేసింది. ఈ రెండు స్థానాల్లో శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుంది.  రాహుల్‌ ఇప్పటికే కేరళలోని వయనాడ్‌ నుంచి పోటీలో ఉన్నారు. ఇప్పుడు మరో స్థానంలో బరిలో నిలుస్తున్నారు.  కాగా, నేడు రాహుల్‌ గాంధీ నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హాజరుకానున్నారు.
కె ఎల్ శర్మ రాయబరేలిలో సోనియా గాంధీ ఎంపీగా ఉన్నంతకాలం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గా ఆమె వ్యవహారాలను ఆయనే చూసుకొంటూ ఉండేవారు. అమేథీలో గాంధీల కుటుంబానికి వీర విధేయుడు, నమ్మినబంటుగా పేరొందారు. అమెధీలో కాంగ్రెస్ అభ్యర్థిగా గాంధీ కుటుంభంకు చెందినివారు 40 ఏళ్ళ తర్వాత పోటీచేస్తున్నట్లు అవుతుంది.
ఆయన బిజెపి అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మ్రితి ఇరానీ నుండి గట్టి పోటీ ఎదుర్కోనున్నారు. 2019 ఎన్నికలలో ఆమె సిట్టింగ్ ఎంపీ అయిన రాహుల్ గాంధీని 55,000 ఓట్ల ఆధిక్యతతో ఓడించారు.  రాహుల్ గాంధీపై దినేష్‌ ప్రతాప్‌ సింగ్‌ను తమ అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. ఆయన  కాంగ్రెస్‌ మాజీ ఎంఎల్‌సీ. 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీపై పోటీ చేసి ఓటమి చెందారు.
రాయబరేలీ ఎంపీగా ఉన్న సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్ కావడంతో.. అక్కడ నుంచి రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నారు. ఐదో దశలో ఈ నియోజకవర్గాల్లో మే 20 పోలింగ్ జరగనుంది. ఇక, రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేస్తారని కూడా ప్రచారం జరిగింది. కానీ, ఈ నిర్ణయం పార్టీలో అసంతృప్తిని పెంచుతుందని, ఇది దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అధిష్ఠానం అనుమానించింది.
కుటుంబ రాజకీయాలంటూ బీజేపీ చేస్తోన్న ఆరోపణలకు బలం చేకూర్చినట్టు అవుతుందని భావించారు. ఒకే కుటుంబంలోని ముగ్గురు పార్లమెంట్‌లో ఉంటారనే భావన ప్రజల్లో వస్తుందని ప్రియాంక విముఖత వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక తన తల్లి సోనియాగాంధీకి కలిసి వచ్చిన నియోజకవర్గం కావడం వల్ల రాహుల్ గాంధీ రాయ్​బరేలీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యినట్లు తెలుస్తోంది.