రేవణ్ణ విదేశీ పర్యటనలో ప్రభుత్వ సంబంధం లేదు

రేవణ్ణ విదేశీ పర్యటనలో ప్రభుత్వ సంబంధం లేదు

లైంగిక దౌర్జన్యం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కర్ణాటకలో జేడీఎస్ నేత, ఎంపీ  ప్రజ్వల్ రేవణ్ దౌత్యపరమైన పాస్‌పోర్టుతో దేశం దాటి వెళ్లారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రన్‌ధిర్ జైశ్వాల్ చెప్పారు. ప్రస్తుతం ఆయన జర్మనీలో ఉన్నట్లు తేలింది. ఆయన విదేశాలకు వెళ్లేందుకు రాజకీయంగా తమకెలాంటి ఆదేశాలు రాలేదని, తామూ ఎటువంటి ఆదేశాలివ్వలేదని గురువారం రన్‌ధిర్ జైశ్వాల్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

పార్లమెంట్ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ, ఎమ్మెల్యే రేవణ్ణలపై లైంగిక దౌర్జన్యం కేసు కర్ణాటక రాజకీయాలను కుదిపివేస్తున్నది.  ఈ నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ జర్మనీకి వెళ్లిపోయారంటూ వచ్చిన వార్తలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు రన్‌ధిర్ జైశ్వాల్ స్పందిస్తూ తమకు రాజకీయంగా ఎటువంటి ఆదేశాలు రాలేదని, తామూ ఎటువంటి వీసా కూడా జారీ చేయలేదని స్పష్టం చేశారు.

దౌత్యపరమైన పాస్ పోర్టుతో దేశాన్ని వీడారని, జర్మనీకి వెళ్లేందుకు ఎలాంటి వీసా అవసరం లేదని రన్‌ధిర్ జైశ్వాల్ చెప్పారు. ఆయన ఏ ఇతర దేశానికి వెళ్లడానికి కూడా వీసా జారీ చేయలేదని వెల్లడించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవణ్ణ పాస్ పోర్టు రద్దు చేస్తారా? అన్న ప్రశ్నపై నేరుగా స్పందించని రన్‌ధిర్ జైశ్వాల్ పాస్ పోర్టు రద్దుకు నియమావళి ఉందని, అయినా కోర్టు నుంచి తమకెలాంటి ఆదేశాలు రాలేదని  తెలిపారు.

ఇలా ఉండగా, ప్రజ్వల్ రేవణ్ణపై లుకవుట్ నోటీసు జారీ చేసినట్లు కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర గురువారం తెలిపారు. తాను విదేశాలలో ఉన్నందున సిట్ ఎదుట హాజరు కావడానికి మరో వారం రోజుల గడువు కావాలని ప్రజ్వల్ కోరడంపై స్పందిస్తూ 24 గంటలకు మించి సమయం ఇచ్చే నిబంధన ఏదీ లేదని విలేకరులతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.

ప్రజ్వల్ విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలిసిన వెంటనే లుకవుట్ నోటీసు జారీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. లుకవుట్ నోటీసు గురించి పోర్టులు, విమానాశ్రయాలకు తెలియచేసినట్లు ఆయన చెప్పారు.  మరో బాధితురాలు కూడా ముందుకు వచ్చి ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసినట్లు హోం మంత్రి వెల్లడించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని పోటీసులు నమోదు చేశారని, ఈలోగా మరో బాధితురాలు కూడా ప్రజ్వల్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారని ఆయన తెలిపారు. ఆమె గురించి వివరాలు వెల్లడించలేనని ఆయన చెప్పారు.

కాగా, ఈ కేసులో మరి నిందితుడైన ప్రజ్వల తండ్రి, మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ కుమారుడు హెచ్ డి రేవణ్ణ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. మరోవంక, ఈ వీడియోలను లీక్ చేసిన వ్యక్తిగా భావిస్తున్న రేవణ్ణ కుటుంబపు మాజీ డ్రైవర్ కార్తీక్ ఓ వీడియో ప్రకటనను విడుదల చేయడం, దాన్ని మలేసియా నుండి విడుదల చేసిన్నట్లు తెలుస్తుండటం విస్మయం కలిగిస్తోంది.

అకస్మాత్తుగా మలేసియా నుండి విడుదల చేయడం వెనుక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్ ల హస్తం ఉండవచ్చని మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి అనుమానం వ్యక్తం చేశారు. అందులో తాను ఆ వీడియోలను పంపిణి చేయలేదని, కేవలం బిజెపి నేత దేవరాజే గౌడకు మాత్రమే అందజేశానని తెలిపారు.