తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం

తెలంగాణాలో 8,10 తేదీల్లో ప్రధాని ప్రచారం

లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతూ ఉండడంతో తెలంగాణాలో అన్ని ప్రధాన పార్టీలు రాష్ట్రంలో జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ రాష్ట్రాన్ని రాజకీయ రణరంగంగా మార్చేశారు. ఈ క్రమంలో బీజేపీ అధిష్ఠానం అగ్రనేతలతో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తోంది.  ప్రచారానికి సమయం దగ్గరపడుతుండటంతో  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బిజెపి అధ్యక్షుడు జేడీ నడ్డా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో మరోసారి పాల్గొననున్నారు.

ఈనెల 8,10 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈనెల 8వ తేదీన వేములవాడలో ఉదయం 9 గంటలకు జరగనున్న బహిరంగ సభకు ప్రధాని హాజరుకానున్నారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు వరంగల్‌ జిల్లా మడికొండలో జరగనున్న బహిరంగ సభకు మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

 అలాగే ఈనెల 10న మధ్యాహ్నం 2 గంటలకు నారాయణపేట జిల్లాలో జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో సాయంత్రం 4 గంటలకు నిర్వహించే హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలతో బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరై బీజేపీకి మరొక్కసారి అవకాశం ఇవ్వాలని కోరనున్నారు.

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 5న మరోసారి రాష్ట్రానికి రాబోతున్నారు. ఉదయం 11.30 గంటలకు ఆదిలాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం సిర్పూర్‌ కాగజ్‌నగర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు.  మధ్నాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని జరిగే బహిరంగ సభకు హాజరుకానున్నారు. అనంతరం మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో జరగనున్న బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు.

అలాగే ఈనెల 6వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు పెద్దపల్లి, మధ్నాహ్నం 1 గంటకు భువనగిరి, సాయంత్రం 3.30 గంటలకు నల్గొండలో జరగనున్న బహిరంగ సభల్లో నడ్డా పాల్గొననున్నారు.