కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై 48 గంట‌ల పాటు నిషేధం

కేసీఆర్ ఎన్నిక‌ల ప్ర‌చారంపై 48 గంట‌ల పాటు నిషేధం
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది. తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఫిర్యాదుపై ఎన్నికల సంఘం ఈ మేరకు చర్యలు తీసుకుంది.
 
అడ్డ‌గోలు మాట‌లు మాట్లాడిన‌ రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్ట‌లేదని,  కానీ తన మీద ఈసీ నిషేధం విధించిందని కేసీఆర్ ఈ సందర్భంగా ధ్వ‌జ‌మెత్తారు. 48 గంట‌లు తన  ఎన్నిక‌ల ప్ర‌చారంపై నిషేధం విధిస్తే దాదాపు 96 గంట‌ల పాటు ల‌క్ష‌లాది బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు అవిశ్రాంతంగా ప‌ని చేస్తారని కేసీఆర్ తెలిపారు.
 
సిరిసిల్లలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఏప్రిల్ ఐదో తేదీన సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
కాంగ్రెస్ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఈసీ కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. అయితే కేసీఆర్ వివరణపై సంతృప్తిచ చెందని ఎన్నికల సంఘం చివరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై రెండు రోజుల పాటు నిషేధం విధించింది. బుధవారం (మే 1) రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం (మే 3) రాత్రి 8 గంటల వరకూ నిషేధం అమల్లో ఉండనుంది.

ఈసీ నోటీసుపై కేసీఆర్ స్పందిస్తూ తన మాటలను అధికారులు సరిగా అర్థం చేసుకోలేదని,  స్థానిక మాండలికాన్ని అధికారులు అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగిందని తెలిపారు. తాను కాంగ్రెస్ విధానాలు, హామీల అమలులో వైఫల్యాన్ని  ప్రస్తావించానని స్పష్టం చేశారు.  ,అయితే కాంగ్రెస్ నేతలు కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకొని ఫిర్యాదు చేశారని వివరణ ఇచ్చారు. 
 
తన వ్యాఖ్యలకు ఆంగ్ల అనువాదం సరికాదని, వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు ట్విస్ట్ చేశారనిపేర్కొ న్నారు. తాను కేవలం కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్నే ప్రస్తావించానని పేర్కొన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందని ఎన్నికల సంఘం 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయొద్దని నిషేధం విధించింది.
 
కేసీఆర్ ఇచ్చిన వివరణపై ఈసీ సంతృప్తిని చెందలేదు. సిరిసిల్ల జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఈసీ స్పష్టం చేసింది. గతంలోనూ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల కమిషన్ తెలిపింది. 
 
పార్టీ అధినేతగా, స్టార్ క్యాంపెయినర్గా కేసీఆర్ ఎన్నికల నియమావళిని పాటించి ఇతర నేతలకు ఆదర్శంగా నిలవాలని సూచించింది. అందుకే 48 గంటల పాటు బహిరంగసభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియాతో మాట్లాడరాదని నిషేధం విధించింది.
 
కాగా, ఇదెక్కడి అరాచకం, ఏకంగా తెలంగాణ ఆవాజ్ కేసీఆర్ గొంతు పైనే నిషేధమా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో వేదికగా ఈసీ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించలేదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపించాయా? అని మండిపడ్డారు. బడే భాయ్..చోటే భాయ్ కలిసి చేసిన కుట్రే ఇదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ బస్సు యాత్రతో బీజేపీ, కాంగ్రెస్ వణికిపోతున్నాయని పేర్కొన్నారు.