రాహుల్ ర్యాలీలో కనిపించని ముస్లిం లీగ్ జెండాపై దుమారం

రాహుల్ ర్యాలీలో కనిపించని ముస్లిం లీగ్ జెండాపై దుమారం
 
* నిషేధిత పిఎఫ్ఐ రాజకీయ విభాగం మద్దతుపై ఆత్మరక్షణలో కాంగ్రెస్ !
 
ఏప్రిల్ 3న  వాయనాడ్‌లో లోక్ సభ ఎన్నికలలో తిరిగి పోటీచేసేందుకు నామినేషన్ వేసేందుకు వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జరిపిన  రోడ్‌షోలో కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ కూటమిలో భాగమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్  (ఇయుఎంఎల్)కు చెందిన పాకిస్తాన్ జాతీయ పతాకంను పోలిన పచ్చజెండాలు లేకపోవడంతో రాజకీయ దుమారం రేగుతుంది. 
 
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇక్కడ రాహుల్ జరిపిన ర్యాలీలో ఆ పచ్చ జెండాలు ఎక్కువగా ఉంటుండడంతో బిజెపి విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో వాయనాడ్‌లో రాహుల్ గాంధీ “పాకిస్తానీ జెండా మోసిన జిహాదీల” మద్దతును అంగీకరించారని అంటూ ప్రచారం చేయడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది.
 
అందుకనే, ఈ పర్యాయం అటువంటి విమర్శలను నివారించడం కోసం అటువంటి వరుసను నివారించడానికి, యుడిఎఫ్ రోడ్‌షోలో కేవలం త్రివర్ణ బెలూన్‌లు, టోపీలు, ప్లేకార్డులను మాత్రమే ఉపయోగించారు. దానితో కాంగ్రెస్, ముస్లిం లీగ్, ఇతర పార్టీల జెండాలు కనిపించలేదు. బిజెపి మతరాజకీయాలకు పాల్పడే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు తమ పార్టీల జెండాలను ఉపయోగించరాదని నిర్ణయించామని స్థానిక ముస్లిం లీగ్ నాయకుడు కుంజుముహమ్మద్ చెప్పారు. 
 
అయితే, ఈ విషయమై కాంగ్రెస్ పై అధికారపక్షం సిపిఎం దాడులు ప్రారంభించింది. రోడ్డుషోలో “మతశక్తులకు” భయపడి కాంగ్రెస్ తన సొంత జెండాలు ఎగురవేసేందుకు కూడా భయపడింది అంటూ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధ్వజమెత్తారు.
 
“ఇప్పుడు కాంగ్రెస్ తన సొంత జెండాను కూడా వదులుకుంది. సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా పోరాటానికి వారు నిజంగా నాయకత్వం వహించగలరా?” అంటూ ప్రశ్నించారు. పైగా, యుడిఎఫ్‌లో ముస్లిం లీగ్ నాయకత్వానికి విలువ ఉండదని హెచ్చరిక చేశారు.  “ముస్లిం లీగ్ వారి జెండాలను తిరస్కరిస్తూ వారి ఓట్లు కావాలని కాంగ్రెస్ ఎందుకు పట్టుబట్టింది?” అంటూ నిలదీశారు.
 
ఆసక్తికరంగా, గత పద్దెనిమిది నెలలుగా ముఖ్యంగా కేరళలోని మలబార్ ప్రాంతంలో గణనీయ ప్రాబల్యం గల ముస్లిం లీగ్ ను ఎల్‌డిఎఫ్‌ వైపు ఆకర్షించడానికి సిపిఎం విఫల ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అయితే ఈ పరిణామంపై బీజేపీ పెద్దగా స్పందించక పోయినప్పటికీ కాంగ్రెస్ ఉగ్రవాద శక్తులతో చేతులు కలుపుతున్నట్లు మండిపడుతుంది. నిషేధిత ఇస్లామిక్ సంస్థ పిఎఫ్ఐ రాజకీయ విభాగమైన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడాన్ని ప్రశ్నించింది.
 
ఈ మద్దతు ప్రకటనపై కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. కాంగ్రెస్‌కు ఎలాంటి రాడికల్‌తో సంబంధం లేదని కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కె. సుధాకరన్‌ స్పష్టం చేశారు. అయితే, ఎస్‌డిపిఐ లేదా సిపిఎం ఓట్లన్నీ స్వాగతిస్తున్నాయని ఆయన మీడియాతో చెప్పడం కాంగ్రెస్ అవకాశవాద ధోరణిని వెల్లడి చేస్తుంది.
 
ఎస్‌డిపిఐ ఆ విధంగా ప్రకటించడం కాంగ్రెస్ ను సంఘ్ పరివార్‌కు వ్యతిరేకంగా “ఏకైక లౌకిక శక్తి”గా చూస్తున్నట్లు వెల్లడి అవుతుందని అంటూ ప్రతిపక్ష నేత వి డి సతీషన్ డొంకతిరుగుడు ప్రకటన చేశారు.  అయితే కాంగ్రెస్ అనుసరిస్తున్న ఈ అవకాశం వైఖరిని బిజెపి ప్రశ్నించింది. 
 
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎస్‌డిపిఐ బేషరతు మద్దతు ఇవ్వడంపై రాహుల్ గాంధీ మౌనం వహించడం ప్రమాదకరమని వాయనాడ్‌లో  రాహుల్ గాంధీపై పోటీ చేస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్ విమర్శించారు. అదేవిధంగా, బిజెపి కేరళ ఇన్‌చార్జి ప్రకాష్ జవదేకర్ కూడా ఈ పరిణామాన్ని “దేశ భద్రతకు ముప్పు”గా అభివర్ణించారు.
 
ఉగ్రవాదులు, వారి అనుబంధ సంస్థలు కాంగ్రెస్‌కు అన్ని చోట్లా ఎందుకు మద్దతిస్తున్నట్లు కనిపిస్తున్నాయి? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఈ ప్రశ్నను కేరళలోనే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.