అరుణాచల్‌లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు

అరుణాచల్‌లోని 30 ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు
సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా మరోసారి బరితెగించింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనని వాదిస్తోన్న చైనా అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేసినట్లు చైనా అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ ఓ కథనం ప్రచురించింది. 
 
కొత్తగా అరుణాచల్‌లోని మొత్తం 30 ప్రాంతాలకు పేర్లను పెట్టినట్లు సమాచారం. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని ఆ కథనం పేర్కొంది. కానీ, ఆ పేర్లు ఏంటనే దానిపై స్పష్టత లేనప్పటికీ.. చైనీస్‌ క్యారెక్టర్లు, టిబెటన్‌, పిన్‌యిన్‌ భాషల్లో వీటిని పెట్టినట్లు సమాచారం. 
 
చైనా క్యాబినెట్‌ నిర్ణయం మేరకు ‘జాంగ్‌నన్‌లోని భూభాగాల’ పేరుతో కొత్త జాబితాను ఆ దేశం విడుదల చేసింది. మే 1 నుంచి ఈ కొత్త పేర్లు అమల్లోకి రానున్నట్లు గ్లోబల్‌ టైమ్స్‌ తెలిపింది. ‘కొత్త పేర్లు మే 1, 2024 నుంచి అమల్లోకి వస్తాయి. చైనా ప్రాదేశిక, సార్వభౌమ హక్కులకు హానికలిగించే విదేశీ భాషలలోని స్థలాల పేర్లను తమ అనుమతి లేకుండా నేరుగా కోట్ చేయడం లేదా అనువదించడం కుదరదు’ అని పేర్కొంది. 
 
ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌‌ను తమ భూభాగమని వాదించే చైనా  ఆ ప్రాంతాన్ని ‘జాంగ్‌నన్‌’ అని పిలుస్తోంది. అక్కడి ప్రాంతాలకు చైనా ఇలా పేర్లను సూచించడం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. 
 
2017లో తొలిసారిగా 6 ప్రాంతాలకు చైనీస్‌ పేర్లను పెట్టిన డ్రాగన్. ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు రెండోసారి పేర్లు పెట్టింది. అలాగే, గతేడాది ఏప్రిల్‌లో 11 ప్రాంతాలకు చైనీస్‌, టిబెటన్‌, రోమన్‌ అక్షరాలతో కూడిన పిన్‌యిన్‌ భాషల్లో అధికారిక పేర్లను సూచించింది. తాజాగా, మరో 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టింది. 
 
కాగా, చైనా తీరును గతంలోనే భారత్‌ తీవ్రంగా ఎండగట్టింది. పేర్లు మార్చినంత మాత్రాన ఆ ప్రాంతాలు భారత్‌లో భాగం కాకుండా పోవని, నిజాన్ని మార్చలేరని తేల్చిచెప్పింది. అరుణాచల్‌ ఎప్పటికీ తమ దేశంలో అంతర్భాగమేనని పునరుద్ఘాటించింది. మరోవైపు, అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్ నేతల పర్యటనలపై కూడా చైనా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇటీవల ఆ రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటించడంపై దౌత్యపరమైన నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దీనికి భారత్ దీటుగానే బదులిచ్చింది.