వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపం పునఃప్రారంభం

వేయిస్తంభాల గుడిలో కల్యాణ మండపం పునఃప్రారంభం
వరంగల్ నగరంలోని వేయి స్తంభాల గుడి కల్యాణ మండపం పునః ప్రారంభమైంది. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా పునరుద్ధరించిన కల్యాణ మండపాన్ని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి ప్రారంభించారు. కాకతీయుల కళా నైపుణ్యానికి ప్రతీక వరంగల్​ నగరంలోని వేయి స్తంభాల గుడి.  అభివృద్ధి పేరుతో 2006లో ఆలయంలోని కల్యాణ మండపాన్ని తొలగించి, పునరుద్ధరించే పనులు చేపట్టారు.
ఆ తర్వాత ప్రభుత్వాలు మారినా అనుకున్న సమయంలో పనులు పూర్తి​ కాలేదు. దాదాపు 17 ఏళ్ల  తర్వాత పనులు పూర్తి కావటంతో శుక్రవారం పునఃప్రారంభించారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడి యాగశాలలో శాంతి హోమం జరిపిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏఎస్‌ఐ అధికారులకు చాలా పరిమితులున్నాయని, ఆ పరిమితుల్లోనే వాళ్లు పనిచేస్తారని, వీటి కారణంగా నిర్మాణం కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనని పేర్కొన్నారు.
దేశ చరిత్రలో కాకతీయుల పాలనాకాలం స్వర్ణయుగం లాంటిదని చెప్పారు.  వ్యవసాయం మొదలుకుని.. కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతివృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత నేటికీ కూడా పరిశోధన అంశాలని తెలిపారు. అలాంటి కాకతీయుల కళావైభవానికి ఇవాళ భక్తులకు అంకితమైనటువంటి ఈ వేయి స్తంభాల మండపం ఓ మచ్చుతునక అని చెప్పారు.
 
మధ్యయుగంలో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాలను ధ్వంసం చేశారని పేర్కొంటూ తుగ్లక్‌ సైన్యం రామప్ప గుడి నుంచి వరంగల్‌ కోట వరకు అన్నింటినీ దెబ్బతీసిందని చెప్పారు. తాజాగా పునర్నిర్మాణం చేసిన వేయి స్తంభాల గుడి కల్యాణ మండపంలో 132 స్తంభాలు ఏర్పాటు చేసినట్లు కిషన్‌రెడ్డి వివరించారు. కాకతీయుల శిల్ప కళా వైభవం అద్భుతమని కొనియాడారు. ప్రాచీన కట్టడాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిదని తెలిపారు.
 
1163లో కాకతీయ పాలకుడైన రుద్రదేవుడు ఈ ఇంజనీరింగ్ అద్భుతంను నిర్మించారు. అప్పట్లోనే దీన్ని నిర్మించేందుకు 72ఏళ్లు పట్టిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.1324- 25లో తుగ్లక్ సైన్యం చేసిన దాడిలో ఈ మందిరం కొంతమేర ధ్వంసమైంది. దీంతోపాటుగా ఈ మందిరంలో ఉన్నటువంటి సూర్య, వాసుదేవ విగ్రహాలను తుగ్లక్ సైన్యం తీసుకెళ్లింది. మధ్యయుగ కాలంనాటి ఈ గుడి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకతను చాటుకుంది. ఇక్కడున్న మండపంలో గ్రామసభలు, నాట్య కార్యక్రమాలు నిర్వహించుకునేవారు.