ఒడిశాలో బీజేడీ, బీజేపీ పొత్తు!

ఒడిశాలో బీజేడీ, బీజేపీ పొత్తు!
ఒడిశాలో 11 సంవత్సరాల తర్వాత అధికార బిజూ జనతాదళ్‌ (బిజెడి), బీజేపీ మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయనున్నాయి. ఆ మేరకు రెండు పార్టీల నుండి స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఒకవేళ, పొత్తు పొడిస్తే ఎక్కువ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ.. అసెంబ్లీ స్థానాల్లో బీజేడీ పోటీచేస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేడీ 105, బీజేపీ 42 సీట్లలోనూ.. పార్లమెంట్ విషయానికి వస్తే బీజేపీ 12 నుంచి 14 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది.
 
బుధవారం మధ్యాహ్నం నుంచి ఢిల్లీ, ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లలో ఇరు పార్టీల అగ్రనేతలు వేర్వేరుగా నిర్వహించిన చర్చలు రెండు పార్టీల మధ్య పొత్తుకు రంగం సిద్ధం అవుతున్నట్లు స్పష్టం చేస్తున్నాయి.  ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసంలో బిజెడి నాయకులు మారథాన్ సమావేశాన్ని నిర్వహించగా, దేశ రాజధానిలో బీజేపీ నాయకులు ఇదే విధమైన సమావేశాన్ని చేపట్టారు. 
 
ఇందులో పొత్తుతో సహా ఎన్నికల విషయాలు చర్చించారు. మూడు గంటల చర్చ తర్వాత, బిజెడి ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యే దేబి ప్రసాద్ మిశ్రా బీజేపీతో పొత్తు గురించి చర్చలను అంగీకరించారు. అయితే స్పష్టంగా ధృవీకరించలేదు.
 
మరోవైపు రాష్ట్ర బీజేపీ అగ్రనేతలంతా ఢిల్లీకి రావాలని జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆదేశించారు. అక్కడ కేంద్ర కార్యాలయంలో ఒడిశాలో ఎన్నికలను ఎదుర్కొనే విషయమై చర్చించారు. హోం మంత్రి అమిత్‌షా, ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్‌ సామల్‌ తదితర నాయకులు ఇందులో పాల్గొన్నారు. 
 
బీజేపీ సీనియర్ నేత, సుందర్‌గఢ్‌ ఎంపీ జోయల్‌ ఓరం విలేకరులతో మాట్లాడుతూ.. ఒడిశా రాజకీయాలపై కూలంకషంగా చర్చ జరిగిందని, సీట్ల సర్దుబాటుపై మాట్లాడుకున్నామని వెల్లడించారు. దీనిపై కేంద్ర నాయకత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో 2009 తర్వాత ఇరు పార్టీలు కలిసి పోటీ చేయడం ఇదే తొలిసారి.
 
బీజేడీ, బీజేపీలు మొదటిసారిగా 1998 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. 11 ఏండ్లపాటు కొనసాగిన ఇరు పార్టీల స్నేహానికి బ్రేక్‌ పడింది. 2009 ఎన్నికల సందర్భంగా 63 అసెంబ్లీ స్థానాలకు బదులుగా 40 చోట్ల, తొమ్మిది ఎంపీ సీట్లకు బదులు ఆరు స్థానాలే ఇస్తామని కమలం పార్టీకి బీజేడీ ప్రతిపాదించింది.
 
 అందుకు ఒప్పుకోని బీజేపీ అధిష్ఠానం ఒటరిగా పోటీ చేసింది. దీంతో ఎన్డీఏ నుంచి బీజేడీ వెలుపలికి వచ్చింది. అయినప్పటికీ కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఆ పార్టీ మద్దతు తెలుపుతూ వస్తున్నది. ఈసారి కూడా బీజేడీ, బీజేపీ మధ్య నువ్వా-నేనా అనే రీతిలో పోటీ ఉంటుందని, బీజేడీ 11, బేజీపీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని సర్వేలు అంచనా వేస్తున్నాయి.  
 
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారంనాడు ఒడిశాలో పర్యటన సందర్భంగా  తన ప్రసంగంలో ఎక్కడా బిజూ జనతాదళ్‌ను కానీ, నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని కానీ ఆయన విమర్శించలేదు. బీజేడీ విషయంలో మోదీ మౌనం వెనుక ఒడిశాలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉండవచ్చనే సంకేతం ఇచ్చారు.