
తరచూ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకొంటే క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో పాటు 32 వ్యాధుల బారిన పడే ముప్పు ఉన్నదని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం హెచ్చరించింది. అంతే కాకుండా దీని వల్ల మానసిక అనారోగ్యం, అకాల మరణ ముప్పు కూడా పెరిగే ప్రమాదం ఉన్నదని తెలిపింది.
పరిశ్రమల్లో తయారయ్యే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్‌లో విటమిన్లు, పీచు తక్కువగా, చక్కెర, ఉప్పు, కొవ్వు ఎక్కువగా ఉంటాయని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఆస్ట్రేలియా, యూఎస్, ఫ్రాన్స్, ఐర్లాండ్ శాస్త్రవేత్తలు తెలిపారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధుల వల్ల కలిగే మరణ ముప్పు 50 శాతం పెరుగుతుందని సాక్ష్యాధారాలతో నిరూపించారు.
ఈ అధ్యయనంలో కోటి మంది నుంచి వివరాలు సేకరించి విశ్లేషించారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల డిప్రెషన్ పెరిగే అవకాశం 22 శాతం ఎక్కువని తేల్చారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వాలు అత్యవసరంగా తగిన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు కోరారు.
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ పాకెట్ల మీద వాటిలో అధిక పరిమాణంలో చక్కెరలు, కొవ్వులు ఉన్నాయని ముద్రించడం; స్కూళ్లు, దవాఖానల దగ్గర అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ప్రచారం, అమ్మకాలు నిషేధించడం; అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ కన్నా ప్రాసెస్ చేయని లేదా తక్కువ ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తక్కువ ధరలకు లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని డియాకిన్ యూనివర్సిటీ రిసెర్చ్ ఫెలో మెలిస్సా ఎమ్ లానే సూచించారు.
More Stories
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
భారత్ అమ్ములపొదిలో చేరనున్న ధ్వని మిస్సైల్
బీజాపూర్ లో 103 మంది మావోయిస్టుల లొంగుబాటు