2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

2027 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
మరో నాలుగేళ్లలో భారత్ జీడీపీ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని, 2027 నాటికి జపాన్, జర్మనీలను అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుందని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ కంపెనీ ‘జెఫరీస్ గ్రూప్’ తెలిపింది. 
 
ఆర్థిక వృద్ధి రేటులో నిరంతర పెరుగుదల, అనుకూలమైన భౌగోళిక రాజకీయ పరిస్థితులు, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరుగుదల, సంస్కరణల విషయంలో వేస్తున్న అడుగులు, బలమైన కార్పొరేట్ సంస్కృతి వంటి పరిణామాల దృష్ట్యా 2027 నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది.
 
గత 10 సంవత్సరాలుగా భారతదేశం 7% వార్షిక వృద్ధి రేటుతో అభివృద్ధి చెందుతోందని, 3.6 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థతో భారత్ తొమ్మిదో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరుకుందని జెఫరీస్ తన నోట్‌లో రాసుకొచ్చింది. దివాలా చట్టం, జీఎస్టీ అమలు, రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం (రేరా), పెద్ద నోట్ల రద్దు వంటి అనేక ప్రధాన సంస్కరణల ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ భారత్ జిడిపి వృద్ధి చెందిందని వెల్లడించింది.  ప్రభుత్వం రోడ్డు, రవాణా వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై సారిస్తున్నది. అలాగే డిజిటల్ ఇన్‌ఫ్రా (యుఐడి, యుపిఐ, డిబిటి) వంటివి స్టార్టప్ ఎకో సిస్టిమ్‌కు దోహదం చేస్తున్నాయని నివేదిక వివరించింది.
 
రాబోయే ఐదేళ్లలో భారత్ 6% వృద్ధి చెందుతుందని అంచనా వేయడంతో పాటు ఇతర పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధి రేట్లు క్షీణించవచ్చని జోస్యం చెప్పింది. అభివృద్ధి చెందిన దేశాలకు వ్యతిరేకంగా పెరుగుతున్న వృద్ధి రేటుని చూస్తుంటే ఈ దశాబ్దం ముగిసేలోపే జిడిపి ర్యాంక్‌లలో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపింది.

అంతేకాదు, గత 10 నుంచి 20 సంవత్సరాలుగా డాలర్ పరంగా భారతదేశ ఈక్విటీ మార్కెట్ 10-12 శాతం చొప్పున నిరంతరం వృద్ధి చెందుతోందని జెఫరీస్ తన నివేదికలో పేర్కొంది. వచ్చే ఐదు నుంచి ఏడు సంవత్సరాల్లో ఈ ఈక్విటీ మార్కెట్లు 8-10 శాతం డాలర్ల రాబడిని అందజేస్తాయని, 2030 నాటికి భారతదేశ స్టాక్ మార్కెట్ మార్కెట్ క్యాప్ $10 ట్రిలియన్‌లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

ప్రస్తుతం భారత్ మార్కెట్ విలువ 4.5 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. కానీ ప్రపంచ సూచీలో భారత్ ఇప్పటికీ 1.6 శాతం (10వ ర్యాంక్) క్షీణతో ఉంది. అయితే మార్కెట్లో ప్రవాహం, కొన్ని అంశాల వల్ల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. గత 15 నుంచి 20 సంవత్సరాల చరిత్రలో మార్కెట్ రాబడులు, కొత్త లిస్టింగ్‌ల వల్ల 2030 నాటికి భారత్ 10 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు చేరుకుంటుందని నివేదిక తెలిపింది.

ఈ సందర్భంగా జెఫరీస్‌కు చెందిన మహేష్ నందూర్కర్ మాట్లాడుతూ, సంస్కరణల దిశగా తీసుకున్న కొన్ని చర్యల కారణంగా భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశీయ పెట్టుబడుల పెరుగుదల కారణంగా  భారతీయ మార్కెట్లో అస్థిరత తగ్గింని పేర్కొదన్నారు. విదేశీ పెట్టుబడిదారుల నుండి పెట్టుబడులు పెంచేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

‘‘మార్కెట్ క్యాప్ పరంగా భారత్ ఐదో అతిపెద్ద దేశం అయినప్పటికీ, బ్లూమ్‌బెర్గ్ వరల్డ్ ఇండెక్స్‌లో దాని ర్యాంకింగ్ కేవలం 2.0% పెరుగుదలతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ లెక్కన విదేశీ పెట్టుబడిదారులు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో పెట్టుబడిని పెంచడానికి విపరీతమైన అవకాశం ఉంది’’ అని జెఫరీస్ తన నోట్‌లో వెల్లడించింది. 

అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే, భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక రేటింగ్ ఏజెన్సీలు, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు కూడా ఈ అంచనా వేయడం జరిగింది.