ఏపీ హైకోర్టులో సాక్షి మీడియాకు ఎదురుదెబ్బ 

ఏపీ హైకోర్టులో సాక్షి మీడియాకు ఎదురుదెబ్బ 
సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ రూ.వందల కోట్ల విలువైన ప్రకటనలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా  ఏపీ ప్రభుత్వానికి, జగతి పబ్లికేషన్స్ ఇందిరా టెలివిజన్‍కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. మీడియాకు ఇచ్చే ప్రకటనల్లో సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. 
 
 వ్యక్తులను గొప్పగా చిత్రీకరిస్తూ ప్రకటనలు ఇవ్వకూడదని, గత ప్రభుత్వాలను విమర్శిస్తూ కూడా ప్రభుత్వ ప్రకటనలు ఉండరాదని సుప్రీంకోర్టు 2015లో మార్గదర్శకాలను జారీ చేసింది.  వైసీపీకి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేలా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలపై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన చెన్నుపాటి సింగయ్య ప్రకటనలకు ప్రభుత్వం సుమారు రూ.4 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
 
మొత్తం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. 2019 జూన్ నుంచి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలు వైసీపీకి లబ్ధి చేకూర్చేలా, ఆ పార్టీ జెండా రంగులను తలపించేలా ఉన్నాయన్న పిటిషనర్ తెలిపారు. వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రకటనలు ఇచ్చారన్న పిటిషనర్ ప్రభుత్వ ప్రకటనల్లో రాజకీయ ఉద్దేశాలు ఉండరాదన్న  సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. 
 
 గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రకటనలు ఉన్నాయన్న పిటిషనర్ ప్రకటనలకు చేసిన ఖర్చును వైసీపీ నుంచి రికవరీ చేయాలన్న కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనంలో ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించి ఏపీ ప్రభుత్వానికి 3 వారాల గడువిచ్చింది. సుప్రీంకోర్టు నిబంధనల మేరకే ప్రకటనలు ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.