
దేశ జియో ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు భవిష్యత్లో ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ వెల్లడించారు. వీటి కోసం వచ్చే ఐదేళ్లలో 50 శాటిలైట్లను ప్రయోగించినట్లు ప్రకటించారు. ఈ 50 శాటిలైట్లను వివిధ కక్ష్యల్లో ప్రవేశపెట్, పలు ప్రాంతాలపై నిఘాతో పాటు సైనిక దళాల కదలికలను పర్యవేక్షించవచ్చని పేర్కొన్నారు.
సరిహద్దులతోపాటు పొరుగున ఉన్న దేశాల సైనికుల కదలికలను కూడా గమనించవచ్చని తెలిపారు. ఐఐటీ బాంబేలో నిర్వహించిన వార్షిక సైన్స్ అండ్ టెక్నాలజీ ఫెస్టివల్లో సోమనాథ్ మాట్లాడుతూ సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు పంపించిన ఆదిత్య ఎల్1 శాటిలైట్ తన ప్రయాణంలో చివరి అంకానికి చేరుకుందని తెలిపారు.
ఆదిత్య ఎల్1 జనవరి 6 వ తేదీన తన గమ్యస్థానమైన ఎల్1 (లాగ్రాంజ్ పాయింట్ 1) పాయింట్ వద్దకు చేరుకోనుందని వెల్లడించారు. భద్రతా దళాల కదలికలను పర్యవేక్షించే సామర్థ్యంతో పాటు వేలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఛాయా చిత్రాలను తీయగల సామర్థ్యంతో వివిధ కక్ష్యలలో ఉపగ్రహాలను రూపొందిస్తున్నట్లు సోమనాథ్ చెప్పారు.
మార్పు గుర్తింపు, డేటా విశ్లేషణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధిత డేటా ఆధారిత ప్రయత్నాల పరంగా ఉపగ్రహాల సామర్థ్యాన్ని మెరుగుపరచడం చాలా అవసరమని చెప్పారు. భారత్ బలమైన దేశంగా ఎదగాలన్న ఆకాంక్షను అందుకునేందుకు ప్రస్తుతం ఉన్న ఉపగ్రహ వాహక నౌకల పరిమాణం సరిపోదని గుర్తు చేశారు.
ఇప్పుడు ఉన్న వాహకనౌకల కంటే 10 రెట్లు అవసరమని ఇస్రో చీఫ్ పేర్కొన్నారు. భారత్ ఈ స్థాయిలో ఉపగ్రహాలను ప్రయోగించగలిగితే దేశం ఎదుర్కొంటున్న ముప్పులను మరింత మెరుగైన రీతిలో తగ్గించవచ్చని సోమనాథ్ చెప్పారు.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ