145కు చేరిన కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు

145కు చేరిన కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు
దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇదే సమయంలో కరోనా సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కూడా చాపకిందనీరులా విస్తరిస్తోంది. తాజాగా డిసెంబర్‌ 28వ తేదీ వరకూ ఈ కొత్త వేరియంట్‌ కేసుల సంఖ్య దేశవ్యాప్తంగా 145కు పెరిగినట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి.
 
145 కేసుల్లో అత్యధికంగా కేరళలో 41 వెలుగు చూశాయి. గుజరాత్‌లో 36, కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, రాజస్థాన్‌లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో రెండు, ఢిల్లీలో ఒకరికి జేఎన్‌.1గా నిర్ధారణ అయ్యింది.  నవంబర్‌ 21వ తేదీ నుంచి డిసెంబర్‌ 18వ తేదీ వరకూ పరీక్షించిన శాంపిల్స్‌లో ఈ కేసులు వెలుగు చూసినట్లు వెల్లడించాయి.  మరోవైపు బిఎ 2.86 రకానికి చెందిన ఈ జేఎన్‌.1 ఉపరకాన్ని ప్రత్యేకమైన ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గీకరించిన విషయం తెలిసిందే. 
 
దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ.. ముప్పు తక్కువేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశంలో ఈ రకం కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రజలు భయపడాల్సిన అసవరం లేదని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో గత 24 గంటల వ్యవధిలో 798 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిసి దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే ఐదు మరణాలు నమోదయ్యాయి.  కర్ణాటకలో ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం తెలంగాణలో 55, ఏపీలో 29 యక్టీవ్ కేసులు ఉన్నట్లు సమాచారం. కేరళలో ఇద్దరు, మహరాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు మరణించారు. ఏపీలో 25, తెలంగాణలో 9 కోవిడ్ కొత్త కేసులు నమోదు కాగా ఏపీలో 54, తెలంగాణలో 64 యక్టీవ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో తొలి జేఎన్.1 వేరియంట్ కోవిడ్ కేసు నమోదయింది.

మహమ్మారి కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి ఎగబాకింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కారణమని తెలుస్తోంది.

సామాజిక దూరాన్ని పాటించడం, మాస్కులు ధరించడం, చేతులను ఎప్పటికప్పుడు శానిటైజర్ చేసుకోవడం, గుంపులుగా ఉన్న ప్రదేశాలకు వెళ్లకుండా ఉండటం, ఒకవేళ వెళ్లిన తగిన జాగ్రత్తలు తీసుకోవడం చేస్తే కరోనా మహమ్మారి సోకదని చెబుతున్నారు. కరోనా మహమ్మారి బారి నుండి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు, ఎవరికి వారు ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.