సమగ్ర దర్యాప్తు జరగకుండానే కెనడా నిందలా?

సమగ్ర దర్యాప్తు జరగకుండానే కెనడా నిందలా?
కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్యపై సమగ్ర దర్యాప్తు జరుగక ముందే నిందలు వేయడంపై భారత హైకమిషనర్‌ సంజయ్‌కుమార్‌ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజ్జార్‌ హత్యకు సంబంధించి చేస్తున్న ఆరోపణలుపై సాక్ష్యాధారాలను విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.  సిటివి ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో  కెనడా ప్రధానమంత్రి ట్రూడో చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఇక్కడ రెండు విషయాలను గుర్తించాలని తెలిపారు.
ఒకటి, విచారణ పూర్తికాకుండానే భారత్‌ని దోషిగా నిర్ధారించడం? రెండోది.. ఇదేనా చట్టబద్ధమైన పాలనా అంటే? అని ఆయన ప్రశ్నించారు.  క్రిమినల్‌ టర్మినాలజీ ప్రకారం విచారణకు సహకరించమని అడిగితే వారు అప్పటికే దోషి అని అర్థం అని సంజయ్ కుమార్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే,  కచ్చితంగా నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సరైన ఆధారాలు ఇవ్వాలని తాము పలుమార్లు కెనడాని అడిగామని, వాటిని పరిశీలించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, జూన్‌ 18న సర్రేలోని గురుద్వారా వెలుపల ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య జరగ్గా ఇందులో భారత్‌ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపించారు. ఈ వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా చేసిన ఆరోపణలను భారత్‌ కొట్టిపడేసింది. ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమని, కేవలం ప్రేరేపితమైనని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఒట్టావా భారతీయ దౌత్యవేత్తను కెనడా విడిచి వెళ్లాలని ఆదేశించగా, భారత్‌ సైతం ఆ దేశ దౌత్యవేత్తను బహిష్కరించింది.