ప్రపంచ క‌ప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన‌ ఆసీస్ ఆల్‌రౌండ‌ర్!

ప్రపంచ క‌ప్ ట్రోఫీపై కాళ్లు పెట్టిన‌ ఆసీస్ ఆల్‌రౌండ‌ర్!
వరుసగా ఆరుసార్లు ప్రపంచ కప్ గెలుపొందడంతో ఆస్ట్రేలియా క్రీడాకారులతో అహంకారం అవధులు దాటుతుందనే విమర్శలు సోషల్ మీడియాలో చెలరేగుతున్నాయి. ఆ టీమ్ ప్లేయర్ మిచెల్ మార్ష్ ఈ ఫైనల్ గెలిచిన తర్వాత సోష‌ల్‌మీడియాలో అదే ప్రపంచ కప్ ట్రోఫీని తన కాళ్ల కింద పెట్టుకొని, చేతిలో బీరు సీసాతో కనిపించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంత అహంకారం పనికి రాదంటూ నెటిజన్లు అతనికి చివాట్లు పెడుతున్నారు. ఎవరైనా సరే వరల్డ్ కప్ ట్రోఫీ గెలిస్తే దానిని నెత్తిన పెట్టుకుంటారు. ముద్దాడతారు. ఆ ట్రోఫీని చూసుకొని మురిసిపోతారు. కానీ ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ మాత్రం ఇలా ఆ ట్రోఫీని తన కాళ్ల కింద పెట్టుకొని అవమానపరిచాడు.

ఆదివారం ఫైనల్ ముగిసిన తర్వాత హోటల్ రూమ్ లో మార్ష్ ఇలా బీర్ తాగుతూ ట్రోఫీని కాళ్ల కింద పెట్టుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొంత మంది అభిమానులు ఇండియా గెలిచినప్పుడు మన ప్లేయర్స్ ఆ ట్రోఫీని ఎలా చూసుకున్నారో గుర్తు చేసుకుంటూ ఇదేం పద్ధతంటూ మార్ష్ తీరును తప్పుబడుతున్నారు.

ట్రోఫీకి కనీస గౌరవం ఇవ్వకపోతే మీరు గెలిచినా ఓడినట్లే అని మరో యూజర్ కామెంట్ చేశాడు. అతనిపై నిషేధం విధించాలంటూ ఐసీసీని కోరుతున్నారు. వరల్డ్ కప్ ట్రోఫీని ఇలా అగౌరవపరచడానికి సిగ్గుండాలి అంటూ ఇంకో యూజర్ పేర్కొన్నారు. నిజానికి క్రికెట్ లో అహంకారానికి ఆస్ట్రేలియన్లు అసలు సిసలు నిదర్శన అనే విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. 

ప్రత్యర్థులను చిన్న చూపు చూడటం, ఫీల్డ్ లో నోటికి పని చెప్పడంలాంటివి చేస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో వాళ్ల గర్వం కాస్త తగ్గింది అనుకుంటున్న సందర్భంలో ఇప్పుడీ ఫొటో మరోసారి దుమారం రేపుతోంది.  ‘ద‌యచేసి ట్రోఫీకి కాసింత మ‌ర్యాద ఇవ్వండి’, ‘ఏర‌కంగా చూసినా ఇది త‌ప్పే’ అని ప‌లువురు కామెంట్లు పెడుతున్నారు. కొంద‌రేమో ‘ఆస్ట్రేలియ‌న్ల‌కు ఇది ఏమంత సిగ్గు చేటు కాదు’ అని అంటున్నారు. కంగారూల తోక వంకరే అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.